YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయవంతమైన ఇసుక వారోత్సవాలు

విజయవంతమైన ఇసుక వారోత్సవాలు

విజయవంతమైన ఇసుక వారోత్సవాలు
- రాష్ట్రంలో తీరిన ఇసుక కొరత
- వారం రోజుల్లో రూ.63 కోట్ల విలువైన ఇసుక విక్రయాలు
- ఆన్ లైన్ లో పారదర్శకంగా బుకింగ్ లు
అమరావతి 
ఇసుక మాఫియా ఆగడాలకు ముక్కుతాడు వేస్తూ నూతన పాలసీ ద్వారా వినియోగదారులకు ఇసుకను అందించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన ఇసుక వారోత్సవాలు విజయవంతం అయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత అనే మాట లేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. గత మూడు నెలలుగా భారీ వర్షాలతో రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులతో పాటు అన్ని నదుల్లోనూ వరద పరిస్థితి కొనసాగింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా వున్న 275 ఇసుక రీచ్‌ లలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో వర్షాలు తగ్గుముఖం పడుతుండగానే అవకాశం వున్న ప్రతి రీచ్‌ లోనూ ఇసుకను వెలికి తీయడం ద్వారా భవన నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఇసుక వారోత్సవాలను ముందుకు తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ, జిల్లా కలెక్టర్ ల ప్రత్యేక పర్యవేక్షణ, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఇసుక రీచ్‌ లను ప్రారంభించడం, పారదర్శకంగా స్టాక్ పాయింట్లు, ఇసుక డిపోల నుంచి ఇసుకను వినియోగదారులకు అందించే ప్రక్రియ గత వారం రోజుల్లో ఊపందుకుంది. నదుల్లో గుర్తించిన ఇసుక రీచ్‌ లతో పాటు ప్రైవేటు పట్టాభూముల్లో ఇసుక మేటలను కూడా గుర్తించి, వారికి ఇసుక తవ్వకాలకు అనుమతులను జారీ చేసే విషయంలోనూ అధికార యంత్రాంగం వేగంగా పనిచేసింది. దీనితో రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు మరింత ముమ్మరంగా జరిగాయి. ప్రారంభంలో రోజుకు లక్ష టన్నులను లక్ష్యంగా పెట్టుకుని, ఇసుక వారోత్సవాలు పూర్తయ్యే నాటికి రెండు లక్షల టన్నుల ఇసుకను రవాణాకు సిద్దంగా వుంచాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాలు ఫలితాలను అందించాయి. వారోత్సవాలు ముగిసే (నవంబర్ 21) నాటికి ఏకంగా సుమారు 2.80 లక్షల టన్నుల లక్ష్యాన్ని అధిగమించడం ద్వారా ఇసుక కొరత అనే మాటకు అవకాశం లేకుండా చేశారు. 

Related Posts