వివాదాల భూమితో వెనక్కి...
విజయవాడ, నవంబర్ 22,
లూలూ ప్రాజెక్ట్‌కి విశాఖపట్నంలో గత ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను జగన్ సర్కార్ రద్దు చేసింది. జగన్ సర్కార్ వైఖరి కారణంగానే లూలూ గ్రూప్ వెనక్కి తగ్గినట్టు విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. లూలూ ప్రాజెక్టుకు కేటాయించిన 13.83 ఎకరాల భూమి కేసుల్లో ఉందని చెప్పారు మంత్రి. న్యాయపరమైన చిక్కులున్న భూమిని అప్పగించడంపై అప్పటి ఏపీఐఐసీ ఎండీ లేఖ కూడా రాశారన్నారు.ప్రాజెక్టు రద్దు చేయడానికి బిడ్డింగ్ లో పారదర్శకత లేకపోవడం.. లూలూకు కేటాయించిన భూమి విలువను తక్కువగా చూపడం ద్వారా ప్రజాధనం వృథా అవ్వడమే ప్రధాన కారణాలని మంత్రి స్పష్టం చేశారు. లూలూకు కేటాయించిన భూమికి మార్కెట్ విలువ ప్రకారం ఎకరా సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.42 కోట్ల వరకూ ఉంటుందన్నారు. అంత విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని.. అందువల్ల ఏడాదికి సుమారు 500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అవుతుందన్నారు.గత ప్రభుత్వం రూ.2,200 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఆర్భాటపు ప్రచారం కోసమే భూములను కట్టబెట్టిందని మంత్రి విమర్శించారు. అంతేకాకుండా ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా లూలూ గ్రూప్ పనులు చేపట్టలేదన్నారు. ఏపీఐఐసీలో ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ ఉందని.. ప్రభుత్వమే అధునాతన భవనాలు నిర్మించగలమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్మించిన హైటెక్స్‌ను అలా కట్టిందేనని గుర్తు చేశారు.సీఎం జగన్ ఆదేశాల మేరకు పారదర్శక పాలనకే పెద్దపీట వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలోని ఇష్టారాజ్యంగా జరిగిన లోపాయికారీ ఒప్పందాలను నేరుగా ప్రజల ముందుంచేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని అసత్య ప్రచారం జరుగుతోందని.. ఎంత రాసినా అబద్ధాలు నిజం కాబోవన్నారు.