ఎఫ్ 2 కంటే సైరానే తక్కువ
హైద్రాబాద్, నవంబర్ 22
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు. దాదాపు పదేళ్లుగా ఈ పాత్రలో నటించేందుకు ఎదురుచూస్తున్న తండ్రి కలను నిజం చేసేందుకు మెగా పవర్ స్టార్ ఖర్చుకు వెనకాడకుండా ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాతో 100 కోట్లపైగా వసూళ్లు సాధించి సత్తా చాటాడు. అదే సమయంలో బాహుబలి సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు మార్కెట్ ఓపెన్ చేయటంతో భారీ చిత్రాలు నిర్మించేందుకు తెలుగు దర్శక నిర్మాతలు ధైర్యం చేశారు. ఆ ధైర్యంతోనే 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో సైరా నరసింహారెడ్డి సినిమాను ప్లాన్ చేశారు చిరు, చరణ్. స్టైలిష్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషలకు చెందిన టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటించారు. అమితాబ్ బచ్చన్, సుధీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతి బాబు ఇలా అన్ని భాషల్లోకు చెందిన నటీనటులతో ప్రతిష్టాత్మకంగా సినిమాను తెరకెక్కించారు.తెలుగులో సూపర్ హిట్ టాక్ వచ్చినా.. ఇతర భాషల్లో మాత్రం సైరా నిరాశపరిచింది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న నార్త్ మార్కెట్‌లో సైరా పూర్తిగా నిరాశపరిచింది. దీంతో భారీ వసూళ్లు ఖాయమనుకున్న చోట సినిమా ఉసూరుమనిపించటంతో మెగా హిట్ అనిపించుకోలేకపోయింది సైరా.సినిమా మీద భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమా 150 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 107 కోట్లకు సినిమాను అమ్మారు. ఇతర రాష్ట్రాలు, ఓవర్ సీస్‌లో కలిపి మరో 45 కోట్ల వరకు బిజినెస్ చేసింది. అయితే ఫైనల్ రన్‌లో మాత్రం ఈ సినిమా 133 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసినట్టుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అంటే 20 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్టుగా భావిస్తున్నారు.ఇటీవల సైరా 50 రోజులు పూర్తి చేసుకుంది. 33 కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది ఆ ఘనత సాధించిన మూడో సినిమా రికార్డ్ సృష్టించింది. అయితే లిస్ట్ లో 110 సెంటర్లతో మహర్షి టాప్ ప్లేస్‌లో ఉండగా 65 స్థానాలతో వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా నిలవటం విశేషం