YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 సూపర్ వైద్యం.. చాలా దూరం.

 సూపర్ వైద్యం.. చాలా దూరం.

 సూపర్ వైద్యం.. చాలా దూరం.. (వరంగల్)
వరంగల్, నవంబర్ 22 : పేద ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుండడంతో కేఎంసీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్‌ఎస్‌వై కింద రాష్ట్రానికి రెండు దవాఖానాలను మంజూరు చేసింది. ఒకటి ఆదిలాబాద్‌ జిల్లాలోని రిమ్స్‌ ఆవరణలో కాగా, మరొకటి వరంగల్‌లోని కేఎంసీలో. రు. 150 కోట్లతో దీని నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందులో కేంద్రం వాటా రూ. 120 కోట్లు. ఈ నిధులు ఇప్పటికే విడుదల కావడంతో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. రాష్ట్రం వాటా రూ. 30 కోట్లు విడుదల కావడం లేదు. నిధుల విడుదలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వైద్యులు, సిబ్బందిని నియమించి సేవలను ప్రారంభించాలి. సకాలంలో నిధులిస్తే ఏడాది క్రితమే ప్రారంభం అయ్యేది. ఈ విషయమై కాకతీయ వైద్య కళాశాల వారు కొంత కాలంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తాజాగా మరోసారి విన్నవించారు. అయినా ఎలాంటి స్పందన లేదు. ఈ జాప్యం వల్ల పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందట్లేదు. పీఎంఎస్‌ఎస్‌వై ఆసుపత్రి 250 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, యూరాలజీ లాంటి పది సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తారు. ఎంజీఎం ఆసుపత్రిలో పదేళ్ల క్రితమే సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు ప్రారంభమైనా అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. దశాబ్ద కాలం క్రితం గుండె శస్త్రచికిత్స జరగ్గా కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ లేక సేవలు నిలిచిపోయాయి. మిగతా కొన్ని విభాగాల్లో అసలు వైద్యులే లేరు. ఈ క్రమంలో కేంద్రం మంజూరు చేసిన పీఎంఎస్‌ఎస్‌వై ఆసుపత్రి వరంలా అంతా భావించారు. ఇది ప్రారంభమైతే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశించారు. పైగా ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ సేవలు మొదలవుతాయని ఎంజీఎం వైద్యశాలలో పునరుద్ధరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టిసారించడం లేదు. 2016లో ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం 2018లో పూర్తి కావాల్సి ఉంది. ఈ ఆసపత్రి ప్రారంభమైతే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఆపరేషన్‌ థియేటర్లు అత్యాధునిక పరిజ్ఞానంతో కడుతున్నారు. పరికరాలను విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఒకేసారి రూ. 30 కోట్లు విడుదల చేయలేకపోయినా విడతల వారీగా కేటాయిస్తే ఈ పాటికే ఆసుపత్రి పూర్తయ్యేది. నిధులు విడుదల చేయాలని ఇప్పటికే అధికారులు ఎన్నోసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తాజాగా లేఖ రాశారు. ఎలాంటి స్పందన లేదు.

Related Posts