YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ

బంగ్లా 106 ఆలౌట్,

బంగ్లా 106 ఆలౌట్,

బంగ్లా 106 ఆలౌట్,
ఇషాంత్ దెబ్బకు చాప చుట్టేసిన బంగ్లా టీమ్
కోల్ కత్తా, 
టీమిండియాతో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో బంగ్లాదేశ్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే చాపచుట్టేసింది. భారత్‌ పేసర్లు చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్‌ వంద పరుగుల మార్కును అతి కష్టం మీద చేరింది. ప్రధానంగా ఇషాంత్‌ శర్మ ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా, ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమీకి రెండు వికెట్లు లభించాయి.  ఇషాంత్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌, స్వింగ్‌ బంతులకు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ బెంబేలెత్తిపోయారు.ఇది ఇషాంత్‌కు టెస్టుల్లో 10వ సారి ఐదు వికెట్లు మార్కు కాగా, భారత్‌లో రెండోసారి.
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్‌ ఇస్లామ్‌-ఇమ్రుల్‌ కేయిస్‌లు ప్రారంభించారు. బంగ్లా 15 పరుగుల వద్ద ఉండగా ఇమ్రుల్‌(4) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇమ్రుల్‌ను ఇషాంత్‌ శర్మ ఎల్బీగా ఔట్‌ చేశాడు. ఆపై కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌, మహ్మద్‌ మిథున్‌, ముష్పికర్‌ రహీమ్‌లు డకౌట్లుగా పెవిలియన్‌ చేరారు. మోమినుల్‌, మిథున్‌లను ఉమేశ్‌ యాదవ్‌ ఔట్‌ చేయగా, రహీమ్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. మూడు బంతుల వ్యవధిలో ఉమేశ్‌ రెండు వికెట్లు తీసి బంగ్లాను గట్టిదెబ్బ కొట్టాడు. దాంతో బంగ్లాదేశ్‌ 26 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ నష్టపోయిందికాగా, భారత బౌలర్లను కాస్త ప‍్రతిఘటించినట్లే కనబడిన షాద్‌మన్‌ ఇస్లామ్‌(29; 52 బంతుల్లో 5 ఫోర్లు)ను ఉమేశ్‌ చక్కటి బంతితో ఔట్‌ చేశాడు. కాస్త స్వింగ్‌ మిక్స్‌ చేసిన బంతికి షాద్‌మన్‌.. కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆరో వికెట్‌గా మహ్మదుల్లా(6) ఔటయ్యాడు. ఇషాంత్‌ శర్మ వేసిన 20 ఓవర్‌ నాల్గో బంతికి మహ్మదుల్లా కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్యాచ్‌ అందుకునే క్రమంలో సాహా మరోసారి ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌స్లిప్‌కు కాస్త ముందు పడబోతున్న బంతిని చక్కని టైమింగ్‌తో ఒడిసి పట్టుకున్నాడు. ఇక మిగతా నాలుగు వికెట్లను మరో 46 పరుగులు జోడించి బంగ్లా కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్‌ 30.3 ఓవర్లలో ముగియడంతో భారత్‌ పేసర్లు ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.భారత్‌లో జరుగుతున్న తొలి పింక్‌ బాల్‌ టెస్టులో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ వచ్చిన తొలి ఆటగాడిగా మెహిదీ హసన్‌ నిలిచాడు. మ్యాచ్‌ మధ్యలో లిటాన్‌ దాస్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరడంతో హసన్‌ కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. ఒక స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ అయిన లిటాన్‌ దాస్‌ అస్వస్థత కారణంగా పెవిలియన్‌ చేరాడు. ఆ క్రమంలోనే మెహిదీ హసన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. కాకపోతే హసన్‌ 8 పరుగులే చేసి ఔటయ్యాడు.

Related Posts