ఎంపీపై వెంకయ్య సీరియస్
న్యూఢిల్లీ,
ఢిల్లీలో నీటి నాణ్యత అంశంపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. జీరో అవర్‌లో ఈ అంశంపై బీజేపీ ఎంపీ విజయ్ గోయల్ మాట్లాడారు. ఆ సమయంలో ఆప్ నేత సంజయ్ సింగ్ నినాదాలు చేశారు. ఢిల్లీలో నీటి నాణ్యత సరిగా లేదని గోయల్ కొన్ని నివేదికలు చదువుతుండగా .. ఆ వ్యాఖ్యలను అరుపులతో ఆప్ ఎంపీ సంజయ్ అడ్డుకున్నారు. ఆ సమయంలో చైర్మన్ వెంకయ్యనాయుడు ఆప్ ఎంపీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నువ్వేమైనా మంత్రివా అంటూ ఆప్ ఎంపీపై వెంకయ్య సీరియస్ అయ్యారు. నీటి నాణ్యత సరిగా లేదని పత్రికల్లో వచ్చిన కథనాలను గోయల్ సభలో ప్రస్తావించారు. అయితే బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను కూడా వెంకయ్య తప్పుపట్టారు.వాటర్ బాటిళ్లు, కాలుష్య మాస్క్‌లను సభలో చూపెట్టరాదు అని వెంకయ్య అన్నారు.
ప్రధాని ఒక్కరే ఎస్పీజి కింద ఉన్నారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) చట్ట సవరణ బిల్లుపై పార్లమెంట్ చర్చించింది. ఈ విషయాన్ని ఇవాళ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. ప్రధానితో పాటు వారి కుటుంబసభ్యులు, మాజీ ప్రధానులు, వారి కుటుంబసభ్యులకు ఎస్పీజీ ప్రత్యేక భద్రతను కల్పిస్తుంది. అయితే ఇటీవల సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలకు ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఇది చర్చాంశమైంది. అయితే ఎస్పీజీ చట్ట సవరణ బిల్లును వచ్చే వారం లోక్‌సభలో చర్చించనున్నట్లు మంత్రి మేఘ్వాల్ చెప్పారు. చట్ట సవరణతో మాజీ ప్రధానుల కుటుంబాలకు ఎస్పీజీ భద్రతను ఎత్తివేస్తారని ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధాని మోదీ ఒక్కరే ఎస్పీజీ భద్రతలో ఉన్నారు. సుమారు 4 వేల మంది భద్రతా సిబ్బంది ప్రధానికి భద్రత కల్పిస్తున్నారు. గార్డులు, హైటెక్ వాహనాలు, జామర్లు, అంబులెన్సులతో ఎస్పీజీ భద్రత ఉంటుంది.