అసదుద్దీన్ పై కేసు
హైద్రాబాద్,
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు శుక్రవారం (నవంబర్ 22) కేసు నమోదు చేశారు. అక్బరుద్దీన్‌పై సెక్షన్ 153, 153 (ఎ), 153 (బి), 506 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.కరీంనగర్‌లో ఓ బహిరంగసభలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది అరుణ్ సాగర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారించిన కోర్టు అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అక్బరుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులను నాంపల్లి కోర్టు గురువారం ఆదేశించింది.కరీంనగర్‌లో మజ్లిస్ పార్టీ జులై 24 నిర్వహించిన బహిరంగ సభలో అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘15 నిమిషాలు వదిలిపెట్టండి. హిందూ, ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తాం’ అంటూ అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.‘నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు. ఏ క్షణమైనా మరణం నన్ను పలకరించొచ్చు. ఎక్కువ కాలం బతకనని డాక్టర్లు చెప్పారు. అయితే.. మరణం విషయంలో నాకు బాధలేదు. నాకున్న బాధంతా ఒక్కటే.. కరీంనగర్‌లో బీజేపీ బలపడటం. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం నాకు చాలా బాధ కలిగించింది’ అని అక్బరుద్దీన్ అన్నారు.నేను భయపడేది నా గురించి కాదు. రాబోయే తరాల గురించే నా భయం. కరీంనగర్‌లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు స్థానికంగా బీజేపీకి అడ్రస్ కూడా లేదు. కానీ, ఇప్పుడు ఏకంగా కరీంనగర్ ఎంపీ స్థానాన్నే గెలుచుకుంది. మజ్లిస్ గెలవలేదని బాధలేదు. బీజేపీ గెలిచిందని ఆవేదనగా ఉంది. ఎంఐఎం గెలవకపోయినా ఫర్వాలేదు. బీజేపీని గెలిపించొద్దు’ అని అక్బరుద్దీన్ పిలుపునిచ్చారు.అక్బరుద్దీన్ నాడు చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ.. అక్బర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు అక్బర్‌కు క్లీన్‌చీట్ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయవాది అరుణ్ సాగర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.