సంకేతాలు ఇచ్చేశారు...
ఏపీలో ఒక్కటవుతున్న విపక్షాలు
విజయవాడ,
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. మడి కట్టుకుని కూర్చునే రోజులు ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేదు. అలాంటిది ఏపీలో మాత్రం ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయాలి ? అందుకే రాబోయే రెండు మాసాల్లోనే మూడు పార్టీలు ఒకే వేదికపైకి ఎక్కుతున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. విషయంలోకివెళ్తే.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బలంగా ఉంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి కూడా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఇసుక కొరత లాంటి ఒకటీ అరా లోపాలు ఉన్నా ప్రస్తుతం జగన్ బలమైన ముఖ్యమంత్రిగానే ఉన్నారు.ఇప్పుడే మనల్ని ఏం పట్టించుకుంటారు? అని అనుకున్న రవాణా రంగంలోని అసంఘటిత కార్మికులపై కూడా హామీ ఇచ్చిన మేరకు వరాల వర్షం కురిపించారు జగన్. ఇక, మిగిలిన రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థుల సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వీరికి అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రం పేరు పక్క రాష్ట్రాల్లో కూడా మార్మోగుతోంది. అదే టైంలో టీడీపీకి చెందిన కీలక నేతలు వైసీపీ, బీజేపీల్లోకి జంప్ చేసేస్తున్నారు. జగన్ దూకుడు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో వైసీపీ మరింత బలమైన శక్తిగా అవతరించడం ఖాయం.దీనిని ముందుగానే పసిగట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన ఆది నుంచి విమర్శలు ప్రారంభిస్తేనే తప్ప .. ఈ దూకుడు ఎదుర్కొనే సత్తా మనకు ఉండదనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. అయితే, ఎవరికి వారుగా జగన్‌పై దూకుడు పెంచినా కూడా లాభం కనిపించేలా లేదు. ఇప్పటికే అనేక ప్రయోగాలు కూడా ఈ ఐదు మాసాల్లో చేసేశారు. దీంతో ఇప్పుడు ఈ మూడు పార్టీలూ కలిసి కట్టుగా జగన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. దీనికి విశాఖలో జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ ప్రాతిపదికగా నిలుస్తోంది. దీనికి బీజేపీ సహా టీడీపీ మద్దతు ప్రకటించాయి. బీజేపీ నేతలు సభకు దూరంగా ఉన్నప్పటికీ.. టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి వారు హాజరయ్యారు. ఇది సక్సెస్ అయింది.దీంతో తాజాగా ఈ నెల 14న చంద్రబాబు చేపట్టే ఇసుక దీక్షకు కూడా కలసి కట్టుగా మద్దతు ప్రకటించారు. కానీ, ఎన్నికలకు ముందు వీరు ఒకరిపై ఒకరు తిట్టిపోసుకున్నారు. ఒకరంటే ఒకరు ఏవగించుకున్నారు. కానీ, ఇప్పుడు జగన్ దూకుడు చూసి కలిసిపోక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ క్రమంలోనే దీనికి మరో రెండు మాసాల్లో మూడు పార్టీలూ ఒకే వేదికపై కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక బీజేపీలో కూడా రెండు వర్గాల్లో ఒక వర్గం టీడీపీకి, చంద్రబాబుకు ఎంత దగ్గరగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. ఇక మరో నాలుగు మాసాల్లో స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో కలిసి వెళ్లడం తప్ప ఈ మూడు పార్టీలకూ మరో గత్యంతరం లేదన్నే పరిస్థితి ఉంది. ఏపీలో త్వరలోనే పాత మిత్రుల సరికొత్త పొత్తు తెరమీదికి వస్తుందని అంటున్నారు పరిశీలకలు. మరి ఏం జరుగుతుందో ప్రజలుఎలా రిసీవ్ చేసుకుంటారో ? చూడాలి.