అనంతపురం జిల్లాలోనే తొలి ప్రయోగం..
పెద్దవడుగూరు రైతు సాహసం..
ఎన్నో ఆశలు, అభిరుచులతో ఇల్లు కట్టుకుంటాం. ఆ తర్వాత ముందు రోడ్డు ఎత్తు పెరిగో.. మరే కారణంగానో ఇల్లు లోతట్టు అయితే ఎంతో ఆవేదన చెందుతుంటాం. రోడ్డు పైనుంచి నీరు ఇంట్లోకి రాకుండా పైకప్పును బద్దలు కొట్టి, గోడల ఎత్తుపెంచుకుంటుంటాం. కింది వైపు కూడా ఎత్తు పెంచుకుంటుంటాం. ఇల్లు రెండు, అంతకు మించి అంతస్తులుంటే ఏమీ చేయలేం. చింతించటం తప్పా. పెద్దవడుగూరుకు చెందిన ఓ రైతు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇష్టంగా కట్టుకున్న ఇల్లు తగ్గులో పడటాన్ని సహించలేదు. ఎలాగైనా ఎత్తు పెంచాలనుకున్నాడు. ఇంటర్నెట్ శోధించి, ఆ పని చేయగల కంపెనీని గుర్తించాడు. ఇంటిని పైకెత్తే సాహసాన్ని కొనసాగిస్తున్నాడు.
జిల్లాలోని పెద్దవడుగూరుకు చెందిన రైతు ధనుంజయరెడ్డి దాదాపు రూ.70 లక్షలు వెచ్చించి, ఇల్లు నిర్మించాడు. వ్యవసాయ దిగుబడులు నిల్వ చేసేందుకు అనుకూలంగా కట్టుకున్నాడు. ఇంటి ముందు మూడడుగుల మేర సిమెంటు రోడ్డు వేస్తున్నారు. దీంతో ధనుంజయ రెడ్డి ఇల్లు రహదారి కంటే తగ్గులోకి వెళ్లింది. చిన్నపాటి వర్షం వచ్చినా.. నీరు ఇంట్లోకి వస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు రైతు ఇంటర్నెట్‌లో శోధించాడు. విజయవాడకు చెందిన ఓ కంపెనీ ఇంటి ఎత్తును పెంచుతుందని తెలుసుకున్నాడు. స్నేహితుడి ద్వారా కంపెనీ ప్రతినిధులను సంప్రదించి, సమస్యను వివరించాడు.
లిఫ్టింగ్-షిఫ్టింగ్ పద్ధతి ద్వారా ఇంటి ఎత్తు పెంచవచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఆ మేరకు పనులకు శ్రీకారం చుట్టారు. ఇంటి అడుగు భాగాన జాకీలను ఏర్పాటు చేసి, ఐదడుగుల మేర ఎత్తు పెంచే కార్యక్రమం చేపట్టారు. 50 మంది కూలీలు నెలరోజులుగా ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంటి అడుగున జాకీలను ఏర్పాటు చేసి, నష్టం వాటిల్లకుండా పనులు చేపడుతున్నారు. జిల్లాలో ఈ సాహసానికి పూనుకున్న తొలి వ్యక్తి రైతు ధనుంజయరెడ్డి కావటం గమనార్హం.
ఆర్థిక భారం తగ్గింది
రహదారి కన్నా లోతట్టు ప్రాంతంలో ఇల్లు ఉండటంతో వర్షపు నీరు లోపలికి చేరే అవకాశం ఏర్పడింది. ఇంటిని తొలగించకుండా సాంకేతికత సాయంతో ఐదడుగుల మేర ఎత్తు పెంచుతున్నా. తద్వారా ఇంటిని కూల్చే ప్రమాదం తప్పింది. ఆర్థిక భారం తగ్గింది.