YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ ప్రభుత్వానికి భారంగా సలహాదారులు

వైసీపీ ప్రభుత్వానికి భారంగా సలహాదారులు

వైసీపీ ప్రభుత్వానికి భారంగా సలహాదారులు
గుంటూరు, 
ఏపీలో ఒకరికి పది మంది సలహాదారులు ఖజానాకు భారం తప్ప ప్రభుత్వానికి పైసా ఉపయోగం కూడా ఉండటం లేదు. ప్రభుత్వం మీద ప్రతి పక్షాలు దూకుడు పెంచి దాడి చేస్తున్నా ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు నిద్ర నటిస్తున్నారు. ఓ వైపు జర్నలిస్ట్ సంఘాలు, మరో వైపు అన్య మత ప్రచారం, ఇంకో వైపు పెట్టుబడి దారులు వెనక్కి మరలడం ఒకటా రెండా ప్రభుత్వానికి భయపడి ప్రధాన స్రవంతి మాధ్యమాలు వెనక్కి తగ్గుతున్నా, సోషల్ మీడియాలో చెలరేగి పోతున్నారు. ఇక పోలీస్ వ్యవస్థ గురించి చెప్పనక్కర్లేదు. కులాలు, మతాలు, జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రచారాలు జోరుగా సాగి పోతున్నా పోలీసులు కూడా పెద్దగా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.మొదట అసత్య కథనాలు కట్టడి చేసే పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 2430పై ఓ యూనియన్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగుతున్న ఈ ఉద్యమానికి ప్రభుత్వ సలహదారుల ఆశీస్సులు కూడా ఉన్నాయని ఆ సంఘాలు చెబుతున్నాయి. తాము ప్రస్తుతం ప్రభుత్వం లో భాగంగా ఉన్నందున మీ ఉద్యమాలు మీరు చేసుకోవాలని సలహా ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా జాతీయస్థాయిలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించడం కూడా నాటకీయంగా జరిగింది. రాష్ట్రంలో ఈ సంఘాల బాధ్యులు వాటి యాజమాన్యాలకు అనుగుణంగా పని చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నా ఏమి ఎరగనట్టు గుంభనంగా వ్యవహరిస్తున్నారు.సోషల్ మీడియాలో గత పది రోజుల్లో విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం ఇదే. మొదట గుంటూరులో రోడ్డు విస్తరణ సందర్భంగా గుడి తొలగించడం, భవానీ ఐలాండ్ స్వాగత తోరణం మీద చిత్రాలతో ఈ ప్రచారం మొదలైంది. ఆ తర్వాత తిరుపతి లడ్డు ధరల పెంపు, హజ్, జెరూసలేం యాత్రలకు ప్రోత్సాహకాలతో సోషల్ మీడియా ప్రచారం పతాక స్థాయికి చేరింది. మత మార్పిడుల మీద మునుపెన్నడూ లేని తప్పుడు ప్రచారం జరుగుతున్నా వాటిని ఖండించే ప్రయత్నాలు జరగలేదు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు మత మార్పిడి అంశాన్ని ఓ పత్రిక లింక్ చేసింది. దీనిని చిలువలు పలువలు చేసి దుష్ప్రచారం జరుగుతున్నా మంత్రులు, సలహాదారులు ఒక్కరు కూడా పెదవి విప్పలేదు. ఇక నిఘా విభాగం గురించి చెప్పనక్కరలేదు. వారం, పది రోజులుగా తప్పుడు ప్రచారాలు కట్టడి చేసే ప్రయత్నం కానీ, అవి ఎక్కడ మొదలయ్యాయో గుర్తించే ప్రయత్నం కనిపించలేదు.పబ్లిసిటీ, ప్రచారం అక్కర్లేదని ప్రభుత్వ సలహాదారులు భావిస్తే తప్పు లేదు కానీ, అద్దాల గదికి చేరామనే అహం ప్రదర్శిస్తేనే అసలు సమస్య. ప్రభుత్వ అధినేతలు ఏరికోరి తెచ్చుకునే ఈ సలహాదారులు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. అప్పుడు చంద్రబాబు హయాంలో కావొచ్చు, ఇప్పుడు జగన్ హయాంలో ఇదే జరుగుతోంది. ఎవరిని కలవకపోవడం, కనీసం జర్నలిస్టుల కు కూడా అందుబాటులో ఉండకపోవడం , తీరికలేనంత బిజీ గా ఉన్నట్లు కనపడటం ఉద్యోగ ధర్మంగా భావిస్తున్నారు. పాలనలో ఏమి జరుగుతుందో మీడియాకు వివరించడం, క్షేత్ర స్థాయిలో లోపాలు తెలుసుకోవడంలో ఈ సలహాదారి వ్యవస్థలు విఫలమవుతున్నాయి.జగన్ ప్రభుత్వం మీద గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిన్న పత్రిక నుంచి, జాతీయ స్థాయిలో ఆరు నెలల ప్రభుత్వం మీద వ్యతిరేక కథనాలు రావడం వెనుక వీరి వైఫల్యమే ప్రధాన కారణం. రాజకీయ ప్రత్యర్థులు బలమైన వ్యూహాలతో ముందుకు వెళుతుంటే వీళ్ళేమో వాట్సాప్ గ్రూప్ ల్లో మన కులం వాళ్లెంత మంది ఉన్నారు, మన జట్టులో అంతా మనోళ్లేనా కదా అనే లెక్కల్లో బిజీగా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక సమాచారం జర్నలిస్టులు అందరికీ అందుబాటులో ఉండేది. ఇప్పుడు దానికి కూడా రకరకాల జాడ్యాలను కొత్త జట్టు అంటించి జగన్మోహన్ రెడ్డిని తమ వంతు జనాలకు దూరం చేస్తున్నారు. ప్రభుత్వానికి మేలు చేయడం మాట అటుంచితే., ఆంధ్రా ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నట్టు ఉంది వారి శైలి.

Related Posts