YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మహా రాజకీయాల్లో మలుపు సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవిస్ రెండుగా చీలిపోయిన ఎన్సీపీ

మహా రాజకీయాల్లో మలుపు సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవిస్ రెండుగా చీలిపోయిన ఎన్సీపీ

మహా రాజకీయాల్లో మలుపు
సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవిస్
రెండుగా చీలిపోయిన ఎన్సీపీ
ముంబై, నవంబర్ 23
మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మలుపు. రాత్రికి రాత్రే సమీకరణాలు మారిపోయాయి. తెల్లారి లేచి చూచేసరికి మరాఠ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ వారిచే ప్రమాణం చేయించారు. అయితే శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ శుక్రవారం రాత్రే ప్రకటించారు. దీంతో తెర వెనుక వ్యూహాలు రచించిన బీజేపీ  అజిత్‌ పవార్‌తో రహస్య మంతనాలు చేసింది. ఈ నేపథ్యంలో తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కోరారు.అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని ఫడ్నవిస్ అన్నారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.అనూహ్యంగా బీజేపీకి ఎన్‌సీపీ మద్దతు తెలపడం, రెండోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు. దీంతో మహారాష్ట్ర పీఠాన్ని అధిరోహించాలన్న శివసేన ఆశలు అడియాశలయ్యాయి.అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న శివసేన కలలను బీజేపీ, ఎన్సీపీ భగ్నం చేశాయి. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ మళ్లీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేశాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది.ముంబై నగర మేయర్‌ పదవిని ఏకగ్రీవంగా దక్కించుకున్నామని మురిసిపోతున్న శివసేనను.. బీజేపీ-ఎన్సీపీ కలిసి ఏకంగా రాష్ట్రంలో అధికారానికి దూరం చేశాయి. శివసేన-ఎన్సీపీ పొత్తును విమర్శించిన బీజేపీ తెల్లారేసరికి ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మహా విశేషం. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా అమిత్‌ షా, నరేంద్ర మోదీ మరోసారి తమ ప్రత్యేకత చాటుకున్నారు. వీరిద్దరి ముందు శివసేన ఎన్ని ఎత్తులు వేసినా పారలేదు.రెండు రోజుల క్రితం ప్రధాని మోదీని ఢిల్లీలో శరద్‌ పవార్‌ కలిసినప్పుడే మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఖాయమని వచ్చిన వార్తలు నేడు నిజమయ్యాయి. అదే సమయంలో శరద్‌ పవార్‌కు ప్రధాని మోదీ.. రాష్ట్రపతి పదవిని ఇవ్వజూపారని శివసేన ఆరోపించింది. అయితే ఈ వార్తలను శరద్‌ పవార్‌ తోసిపుచ్చారు. కాంగ్రెస్‌, శివసేన చర్చలు జరుపుతూనే పవార్‌ చాణిక్యం ప్రదర్శించడం విశేషం. మొత్తానికి శివసేనకు ఊహించని షాకివ్వడం ద్వారా మోదీ-షా ద్వయం సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది

Related Posts