కొత్త మ్యాప్ లో అమరావతకి చోటు
విజయవాడ, నవంబర్ 23
కేంద్రం ఇటీవల రిలీజ్ చేసిన ఇండియా మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అమరావతిని ఎందుకు గుర్తించలేదంటూ ఏపీకి చెందిన నేతలు మోదీ సర్కారును నిలదీశారు. బాబు సర్కారు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా.. ఇండియా మ్యాప్‌లో అమరావతిని పేర్కొనకపోవడాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గురువారం పార్లమెంట్‌లో ప్రస్తావించారు.ఇది ఏపీ ప్రజలను అవమానించడమేనన్న ఎంపీ.. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని కూడా అవమానించినట్టేనని తెలిపారు. అమరావతితో కూడిన మ్యాప్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.పార్లమెంట్‌లో గల్లా జయదేవ్ అమరావతి విషయమై మాట్లాడిన మరుసటి రోజే.. అమరావతితో కూడిన ఇండియా మ్యాప్‌ను కేంద్రం రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన కొత్త మ్యాప్‌ను కూడా ట్వీట్ చేశారు.