YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు   - టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు   - టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు  
- టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి
తిరుపతి నవంబర్ 23, (న్యూస్ పల్స్)
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.  శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం ఉదయం ధ్వజారోహణం సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరు ఎంతో పవిత్రమైన ప్రదేశమని, అమ్మవారి కోసం సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామివారు 12 సంవత్సరాలు నిరీక్షించారని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఇంతటి మహిమాన్వితమైన ప్రదేశంలో అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల తరహాలో ఇక్కడ కూడా ఎలాంటి రాజీకి తావు లేకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వాహనసేవల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. భక్తులకు సంతృప్తికరంగా దర్శన ఏర్పాట్లు -  టిటిడి ఈవో  అనిల్ కుమార్ సింఘాల్శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు మూలమూర్తితోపాటు వాహనసేవలను సంతృప్తికరంగా దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని టిటిడి ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈవో మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 27న గజవాహనం, నవంబరు 28న స్వర్ణరథం, గరుడ వాహనం, నవంబరు 30న రథోత్సవం, డిసెంబరు 1న పంచమితీర్థం జరుగనున్నాయని తెలిపారు. అన్ని వాహనసేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, తిరుచానూరులో 10 డిస్ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేశామని వివరించారు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టిటిడి భద్రతా సిబ్బంది 350 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్.సి.సి.విద్యార్థులు 200, శ్రీవారి సేవకులు 200, పంచమితీర్థం నాడు పోలీస్ సిబ్బంది 1500 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని వెల్లడించారు  రోజుకు 10 వేల శ్రీవారి లడ్డూలు భక్తులకు విక్రయిస్తామని ఈవో తెలిపారు. రోజుకు 5 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామని, పంచమితీర్థం నాడు 160 కౌంటర్ల ద్వారా 60 వేల మందికి అన్నప్రసాదాలు, 30 వేల మందికి అల్పాహారం, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం 300 శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బందితో పారిశుద్ధ్య చర్యలు చేపడతామని తెలిపారు. పంచమితీర్థం రోజున భక్తులకు పంపిణీ చేసేందుకు 1.50 లక్షల వాటర్ బాటిళ్లు సిద్ధంగా ఉంచుకున్నామని వివరించారు.

Related Posts