ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి నవంబర్ 23,
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పట్టపుదేవేరి అయిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండుగగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 8.50 గంటలకు వృశ్చిక లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. కంకణభట్టార్ వేంపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.గజపట ప్రతిష్ఠ : ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు.