ఆపరేషన్ 12 టూ 8...
ఫడ్నవిస్ సీఎం...
అసలేం జరిగింది...
ముంబై, నవంబర్ 23
కాంగ్రెస్-ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తున్న ప్రయత్నాలకు అజిత్ పవార్ గండికొట్టారు. శుక్రవారం రాత్రి వరకూ శివసేనతో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆయన అనూహ్యంగా బీజేపీకి జైకొట్టారు. దీంతో రాష్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేయడం, ముఖ్యమంత్రిగా దేవేందర్ ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం క్షణాల్లో జరిగిపోయాయి. అజిత్ పవార్ నిర్ణయం వ్యక్తిగతమని, ఎన్‌సీపీకి సంబంధం లేదంటూ శరద్ పవార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చర్యలకు ఉపక్రమించింది. ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి అజిత్ పవార్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తారనే ప్రచారం సాగుతోంది.మరోవైపు, అజిత్ పవార్‌పై కాంగ్రెస్, శివసేన విమర్శలు గుప్పించాయి. మహారాష్ట్ర ప్రజలను అజిత్ మోసం చేశారని శివసేన నేత సంజయ్ రౌత్ దుయ్యబట్టారు. పవార్‌కు తెలియకుండా కథ నడిపించిన అజిత్ పవార్.. తమతో జరిగిన సమావేశాల్లోనూ అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారని అన్నారు.శుక్రవారం రాత్రి 9 గంటల వరకు కాంగ్రెస్-ఎన్‌సీపీ, శివసేన మధ్య జరిగిన చర్చల్లో పాల్గొన్న అజిత్ పవార్ ఆ తర్వాత బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. రాత్రి 11.45 ప్రాంతంలో అజిత్-బీజేపీ మధ్య అవగాహన ఒప్పందం కుదరగా, ఇది జరిగిన సరిగ్గా పది నిమిషాల తర్వాత అంటే 11.55కు దేవేందర్ ఫడ్నవీస్ తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీల సీఎం అభ్యర్థి పేరును ప్రకటించడానికి ముందే ప్రమాణస్వీకారం జరిగిపోవాలని సూచించారు.గవర్నర్ భగత్‌సింగ్ కోశ్వారీ శనివారం ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా అర్ధరాత్రి 12.30 గంటలకు దీనిని రద్దుచేసుకున్నారు. రాష్ట్రపతి పాలనను రద్దుచేయడానికి నోట్ సిద్దం చేయమని తన కార్యదర్శికి తెల్లవారుజామున 2.10 గంటకు గవర్నర్ ఆదేశించారు. ఉదయం 5.47కు రాష్ట్రపతి పాలన రద్దు ఉత్తర్వులను పొందుపరిచి, ఉదయం 6.30 గంటలకు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు.ఫైల్ పంపడానికి రెండు గంటల పడుతుందని, ఉదయం 7.30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించాలని సెక్రెటరీ బదులిచ్చారు. ఉదయం 5.30 గంటలకు ఫడ్నవీస్, అజిత్ పవార్ రాజ్‌భవన్‌కు చేరుకోగా, 5.47కు రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఉదయం 9 గంటల వరకూ ఈ విషయం వెల్లడించలేదు. సరిగ్గా 7.50 నిమిషాలకు ఫడ్నవీస్, పవార్‌తో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.