YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

దోమ గెలిచింది..

దోమ గెలిచింది..

దోమ గెలిచింది..(నిజామాబాద్)
నిజామాబాద్, నవంబర్ 23 దోమలు పుట్టకుండా చూడటంలో విఫలమయ్యారు. అవి పురుడు పోసుకొని మనుగడలోకి వచ్చి మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చాయి. కనీసం ఇప్పటికైనా పెరిగిన దోమలను నియంత్రించడంపై పురపాలికలు చోద్యం చూస్తున్నాయి. లార్వా దశలో నియంత్రించ లేని దోమలను కనీసం ఫాగింగ్‌ ద్వారానైనా నియంత్రించాలన్న సూచనలను పట్టించుకునే అధికారులు లేకుండా పోయారు.ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో డెంగీ జ్వరాలు విజృంభిస్తుంటే బల్దియా యంత్రాంగం మాత్రం ‘ప్రత్యేక’తను చాటుకొంటున్నాయి. ఒకవైపు డెంగీ తీవ్రత నానాటికీ జటిలంగా మారుతోంది. పురపాలక అధికారుల సహకారం లేకుండా నిలువరించడం సాధ్యం కాదన్న అభిప్రాయం అధికారుల్లో ఉన్నా బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా నిజామాబాద్‌ నగరంలో సమస్య తీవ్రంగా ఉంది. తక్షణ ఉపాయంగా ఫాగింగ్‌ అవసరమని చెబుతున్నారు.  దోమలతో వ్యాప్తి చెందే వ్యాధుల నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ మూడంచెల నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. యాంటీ లార్వా ఆపరేషన్‌ కింద దోమ పుట్టకుండా గుడ్డు దశలోనే నియంత్రించడం. అందుకు స్థానిక సంస్థలు, వ్యాధి తీవ్రతను బట్టి ఆరోగ్య శాఖ టెమీఫాస్‌ను నీటిలో కలిపి పిచికారీ చేస్తారు. ఇది నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో చేపడతారు. డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదైన వారి ఇంటి పరిసరాల్లో నివారణ చర్యలు తీసుకొంటారు. అప్పటికే అక్కడ ఉన్న దోమలను నియంత్రించడానికి వ్యాధి సోకిన వ్యక్తి ఇంటి చుట్టూ 50 ఇళ్లలో పైరిత్రం మందును కిరోసిన్‌లో కలిపి గాలిలో పిచికారీ చేస్తారు. దోమలు వెంటనే చనిపోయి వ్యాధి వ్యాప్తి చెందకుండా నిలువరించడానికి ఇదో మార్గం. దోమల సంఖ్య పెరిగిపోయి... వ్యాధుల విజృంభించే సమయంలో తక్షణం దోమల సంహారానికి ఫాగింగ్‌ చేయడం. అంటే మలాథియన్‌ మందును డీజిల్‌లో కలిపి ఒక యంత్రం ద్వారా పొగ వ్యాప్తి చెందించాలి. ఇలా చేయడంతో దోమలు కనీసం యాభై శాతం చనిపోతాయని అధికారులు చెబుతున్నారు. పురపాలక అధికారులు ఫాగింగ్‌తో పెద్దగా ప్రయోజనం ఉండదన్న వాదన వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా బల్దియాల్లో ఫాగింగ్‌ యంత్రాల నిర్వహణను కూడా గాలికొదిలేశారు. పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉన్నాయి. కొన్ని మూలనపడ్డాయి. ఉన్న వాటిని సమర్థంగా వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్‌ నగరమంతటికీ కలిపి ఒక్కటే అందుబాటులో ఉంది. బోధన్‌ మున్సిపాలిటీలో ఉన్న మూడు ఏడాదిగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఇలా బల్దియాకో సమస్య నెలకొంది. పైరిత్రం పిచికారీ చేయడానికి కిరోసిన్‌ తప్పనిసరి. ఇటీవల జిల్లా పాలనాధికారి వైద్య శాఖకు 50 లీటర్ల కిరోసిన్‌ ఇప్పించాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. కానీ ఇప్పటి వరకు లీటరు కూడా దొరకలేదట. బోధన్‌ డివిజన్‌కు సంబంధించిన యంత్రాంగం మార్కెట్‌లోనూ లభించడం లేదని పొరుగున ధర్మాబాద్‌ నుంచి పది లీటర్లు కొనుగోలు చేసుకొచ్చి కాలం వెళ్లదీశారు. వైద్య శాఖకు ఇదో అదనపు సమస్యగా మారింది. వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న సమీక్షలు తరచూ జరుగుతున్నాయి. కానీ పరిష్కారం చూపలేకపోతున్నారు. దాదాపుగా అన్ని సమావేశాల్లోనూ ఫాగింగ్‌కు చర్యలు తీసుకొంటే కొంతమేరకు ఉపశమనం ఉంటుందనే వాదన వినిపిస్తున్నారు. ఇప్పటికే పుట్టిన దోమలు విహరిస్తున్నాయి. ఒకేసారి వాటిని చంపడానికి మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. ఈ నేపథ్యంలో దోమలను పొగ బెట్టి చంపడమే పరిష్కార మార్గమని చెబుతున్నారు. కనీసంగా 50 శాతమైనా చనిపోతాయని చెబుతున్నారు. తరచూ చేయడం వల్ల తీవ్రతను తగ్గించుకోవచ్చన్న వాదన ఉంది. అందుకు ప్రణాళిక రూపొందించుకుని ఏకకాలంలో పొగ బెడితే ఆశించిన ఫలితం రావొచ్చని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. యంత్రాలు అందుబాటులో ఉన్న బల్దియాల్లో అడపాదడపా ఫాగింగ్‌ చేసి చేతులు దులుపుకొంటే సమస్య పరిష్కారం కాదు. దోమల సీజన్‌లో నిరంతర ప్రక్రియ కొనసాగాల్సిందే.

Related Posts