YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

రబీని మరిచారా..?(పశ్చిమగోదావరి)

రబీని మరిచారా..?(పశ్చిమగోదావరి)

రబీని మరిచారా..?(పశ్చిమగోదావరి)
ఏలూరు, : జిల్లాలో ఖరీఫ్‌ సాగు ముగుస్తున్నా నేటికీ రబీసాగు ప్రణాళిక ఊసేలేదు. రబీ సాగుకు అన్నదాతలను సన్నద్ధం చేయాల్సిన యంత్రాంగం ఆ దిశగా కార్యాచరణ చేపట్టలేదు. సాగు ప్రణాళిక ఖరారు కాకపోవడంతో అన్నదాతలు అయోమయంలో పడుతున్నారు. ఏయే ప్రాంతాల్లో దాళ్వా సాగు ఉంది.. ఆ ప్రాంతాలకు సాగునీటి విడుదల, విత్తనాల పంపిణీ, ఎరువుల నిల్వలు, రాయితీపై యంత్ర పరికరాలు అందజేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలి. ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడకపోవడంతో లక్షలాది మంది రైతులు రబీ సాగు ప్రణాళిక కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో గోదావరి, కృష్ణా డెల్టాల కింద, మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద 2,20,502 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ప్రస్తుతం గోదావరి డెల్టా కింద వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైతులు యంత్రాలు, కూలీలతో పంట కోస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 50 వేల హెక్టార్లలో కోశారు. గోదావరి డెల్టాలో నెలాఖరులోగా వరికోతలు పూర్తికానున్నాయి. ప్రస్తుతం చాగల్లు, తాళ్లపూడి, భీమడోలు, నల్లజర్ల, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, కొవ్వూరు, దేవరపల్లి, తణుకు, ఉండ్రాజవరం, నిడదవోలు, ఉండి మండలాల్లో వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అనంతరం మడులు పోసేందుకు రైతులు సిద్ధమవుతారు. డిసెంబరులోగా రబీ నాట్లు పూర్తి చేయాల్సి ఉంది. డిసెంబరులో నాట్లు వేయాలంటే ఈ నెలాఖరులోగా నారుమళ్లు పోయాలి. క్షేత్రస్థాయిలో ఆ దిశగా కార్యాచరణ కానరావడం లేదు.  ఈసారి రబీలో జిల్లాలో సుమారు 1.70 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగుచేయనున్నారు. ఇప్పటివరకు రైతులకు రాయితీపై వరి విత్తనాలు అందజేయలేదు. దీంతో వారు ప్రైవేటు విత్తన కంపెనీల నుంచి అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఏపీ సీడ్స్‌ వారు వరి విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అందని సేద్యపు పరికరాలు: యాంత్రీకరణ పథకానికి కేంద్రం 60 శాతం,రాష్ట్రం 40 శాతం చొప్పున నిధులు కేటాయిస్తున్నాయి. రైతులకు అవసరమైన సేద్యపు పరికరాలను రాయితీపై అందజేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 70 శాతం, ఇతర రైతులకు 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తారు. వచ్చిన నిధుల్లో 33 శాతం మహిళా రైతులకు ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. ఖరీఫ్‌ ముగిసి రబీకి సమయం ఆసన్నమైనా ఇప్పటి వరకు యంత్రపరికరాలను పంపిణీ చేయలేదు. చిన్న కమతాల సాగు రైతులు తైవాన్‌ స్ప్రేయర్లు, విత్తనాలు ఎదపెట్టే గొర్రు, గొర్రు నాగళ్లు, మినీ ట్రాక్టర్లు, రొటోవేటర్‌ వంటివాటిని జిల్లాలో అన్నదాతలు అధికంగా వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యాంత్రీకరణ పథకంలో రైతులకు రాయితీపై పరికరాలు అందజేయాలని కోరుతున్నారు. కృష్ణా - ఏలూరు కాలువ కింద రెండో పంటపై స్పష్టత లేకపోవటంతో పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలంలోని సీతంపేట ఛానల్‌ ఆయకట్టు రైతులు అయోమయంలో పడ్డారు. ఖరీఫ్‌లో ముందస్తుగా నాట్లు వేసిన వరి చేలు కోతకు వచ్చాయి. వరికోతల అనంతరం రెండో పంటలో వరి లేదా అపరాలు సాగు చేయాల్సి ఉంది. సాగునీటి సరఫరాపై స్పష్టత కొరవడటంతో రైతులు పాలుపోని స్థితిలో ఉన్నారు. పోణంగి పుంత ద్వారా ఏలూరు మండలంలోని 10 వేల ఎకరాలకు గోదావరి జలాలను సరఫరా చేసి రబీలో దాళ్వాకు సాగునీరు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. రబీలో వరి సాగుకు రుణ ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదు. దీంతో బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు అందని ద్రాక్షలా మారింది. జిల్లాలో 70 శాతం మంది కౌలురైతులు సాగు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి సకాలంలో రుణాలు అందకుంటే వీరంతా ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించక తప్పదు. అధికారులు రుణ ప్రణాళికను ఖరారు చేసి సకాలంలో రుణాలు మంజూరు చేయిస్తే విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేసి రబీ సాగుకు సన్నద్ధమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి.

Related Posts