కేరాఫ్ దోమ (నెల్లూరు)
నెల్లూరు, : నగర, పురపాలికల పరిధిలో ఖాళీ స్థలాలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. వాటి నిర్వహణను స్థల యజమానులు, పుర అధికారులు పూర్తిగా మరిచారు. ఫలితంగా మురుగునీటి కుంటలు, చెత్తకుప్పలు, కంపచెట్లతో దర్శనమిస్తున్నాయి. అందులోనే పందులు, విషపురుగులు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. పరిసరాలు అపరిశుభ్రంగా దుర్గంధాన్ని పంచుతున్నాయి. సమీపంలోనే నివాసం ఉన్న వారు అసౌకర్యానికి గురవుతున్నారు. నగర, పుర అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఆ బాధ్యత తమదికాదని అంటున్నారు. స్థల యజమానులను గుర్తించి నోటీసులు ఇస్తామని చెప్పి పంపుతున్నారు.సమస్య వచ్చిన తర్వాత పరిష్కార చర్యలు తీసుకోవడం కన్నా సమస్యలు రాకుండా చూడటమే మిన్న అని ప్రభుత్వం చెబుతుంటే.. అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నెల్లూరునగరంతో పాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి పట్టణాల్లో దోమల సమస్య ఈ నాటిది కాదు. సమస్యకు పరిష్కారం కావాలంటే నగరపాలిక అధికారులు ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఖాళీ స్థలాలను చెత్త దిబ్బలుగా మారిస్తే ఆ స్థలాలు దోమలకు నివాసాలుగా ఎలా తయారవుతాయో వివరించాలి. పాలిథిన్ కవర్లు వినియోగిస్తే ఆ కవర్లు మురుగు కాలువల్లో పేరుకుపోయి దోమలకు నిలయాలుగా ఎలా వృద్ధి చెందుతాయో చెప్పాలి. 54 డివిజన్లు ఉన్న నగరపాలకసంస్థలో ప్రతి డివిజన్‌లోనూ దాదాపు మురుగు కుంటలున్నాయి. ప్రధానంగా మాగుంట లేఅవుట్, ఇస్కాన్‌సిటీ, ఇరుగాళమ్మసంఘం, పరమేశ్వరినగర్, మనుమసిద్ధినగర్, కొత్తూరు, చంద్రబాబునగర్, అయ్యప్పగుడి తదితర ప్రాంతాల్లో మురుగు కుంటలు దోమలకు ఆవాసాలుగా మారాయి. మురుగు కుంటలను నిర్మూలించడానికి నగరపాలిక అధికారులు ఎలాంటి ప్రణాళికలు అమలుపరచలేదు. నివాస ప్రాంతాల మధ్య గల ఖాళీ స్థలాలు ప్రజారోగ్యం పాలిట అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఖాళీ స్థలాల నిర్వహణను వాటి యజమానులు పట్టించుకోకుండా వదిలేశారు. నగర, పురపాలికలు నిర్వహణ బాధ్యత తమది కాదని చెబుతోంది. స్థలాల యజమానులు, అధికారులు ఈ సమస్యను ఇలాగే వదిలేయడంతో ఖాళీ స్థలాలు డంపింగ్‌యార్డులను తలపిస్తున్నాయి. ప్రజారోగ్య చట్టం ప్రకారం ఖాళీ స్థలాల యజమానుపై చర్యలు తీసుకునే అవకాశం అధికారులకు ఉన్నా ఆ అధికారాలను వినియోగించుకోవడం లేదు. ప్రధాన మురుగు కాలువల్లో పూడికతీత లోపభూయిష్టంగా మారింది. పూడిక తీశామని చెబుతున్నా కాలువల వద్ద నీరు ముందుకు కదలడం లేదు. వేసవిలో చేపట్టాల్సిన పూడికతీత పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడం గమనార్హం.