తిరుచానూరులో ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఛైర్మన్, ఈవో
తిరుపతి
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరులోని శుక్రవారపుతోటలో ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను శనివారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవోఅనిల్ కుమార్ సింఘాల్ కలిసి ప్రారంభించారు. ఇందులో టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌరాణిక ఘట్టాలు ఆకట్టుకున్నాయి. ఇందులో శ్రీవారి గడ్డం కింద తెల్లచుక్క వృత్తాంతం, శ్రీకృష్ణుని సాయంతో జరాసంధుడు అనే రాక్షసుడిని సంహరిస్తున్న భీముడు, అష్టలక్ష్మీ వైభవం, బృందావనంలో రాధాకృష్ణులు, చిన్నికృష్ణుడు, పద్మావతి దేవికి ఎరుకలసాని వేషంలో సోది చెప్పిన శ్రీనివాసుడు, యుద్ధంలో మూర్చపోయిన లక్ష్మణుడిని కాపాడేందుకు మూలికల కోసం సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్న హనుమంతుడు, విశ్వామిత్రుని యాగ రక్షణలో మారీచ, సుబాహు అనే రాక్షసుల దుశ్చర్యలను అడ్డుకొంటున్న శ్రీరామలక్ష్మణులు, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి సంరక్షణార్థం భీష్ముడిపై చక్రాన్ని ప్రయోగిస్తున్న శ్రీకృష్ణుడు, శ్రీ లక్ష్మీవరాహస్వామివారి సైకత శిల్పం తదితర పౌరాణిక అంశాలు ఉన్నాయి. అదేవిధంగా, కూరగాయలతో రూపొందించిన దేవతామూర్తుల మండపం, చామంతి, రోజాలు, పెట్రోనియా, బిగోనియా, సాల్వియా తదితర జాతుల రంగురంగుల పూల మొక్కలు, పూలతో రూపొందించిన ఏనుగు, కలశం, సీతాకోకచిలుక, డాల్ఫిన్లు, గొడుగు తదితర ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేద ప్రదర్శనశాల, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ గోపాలకృష్ణారెడ్డి, ఏవిఎస్వో నందీశ్వర్రావు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.