YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

అప్పుడు శరద్... ఇప్పుడు అజిత్

అప్పుడు శరద్... ఇప్పుడు అజిత్

అప్పుడు శరద్... ఇప్పుడు అజిత్
ముంబై, 
శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు ఖాయమైన సందర్భంలో తన ఎత్తులతో కమలనాథులు ఊహించని షాక్ ఇచ్చారు. రాజకీయ పండితులు సైతం ఇలాంటి మలుపు తిరుగుతుందని ఊహించలేకపోయారు. ఉద్దవ్‌ ఠాక్రే మ‌హారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయ‌డ‌మే లాంఛనమని భావిస్తుండగా కొన్ని గంట‌ల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సేనతో కలిసి అధికార పీఠాన్ని పంచుకోడానికి ససేమిరా అన్న కాషాయదళం.. అజిత్ ప‌వార్‌ను తనవైపు తిప్పుకుని పంతాన్ని నెగ్గించుకుంది. అజిత్ తమకు మద్దతు ఇస్తున్న విషయం బయటకు పొక్కకకుండా జాగ్రత్తలు తీసుకుని, గుట్టుచప్పుడు కాకుండా శనివారం ఉదయం 8.00 దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు.శాసనసభ ఎన్నికల ఫ‌లితాల అనంత‌రం శివ‌సేన అడ్డం తిర‌గ‌డంతో బుజ్జ‌గింపుల‌కు స్వస్తిపలికిన అమిత్ షా, మోదీ ద్వయం ప్లాన్ బి అమలుచేశారు. శివసేన, ఎన్సీపీ- కాంగ్రెస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధమవుతుంటే బీజేపీ తన అమ్ములపొదిలోని అస్త్రాలను బయటకు తీసింది. దాదాపు ఐదు ద‌శాబ్దాల‌కుపైగా వైరి ప‌క్షాలుగా ఉన్న శివసేన, కాంగ్రెస్‌లు చేతులు కలపడం ఆ పార్టీల్లోని కొందరికి అసలు మింగుడుపడటం లేదు. దీన్ని తనకు అనుకూలంగా మలచుకున్న బీజేపీ.. ఎన్సీపీతో తెర‌చాటు రాజకీయాలు మొదలెట్టింది. శివసేనతో కలవడంపై అసంతృప్తిగా ఉన్న అజిత్ పవార్‌తో బీజేపీ చ‌ర్చ‌లు జరిపి సఫలమైంది.ఈ ఆటలో శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలోని నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. పార్టీ నిలువునా చీల్చిన అజిత్ ప‌వార్.. బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లికారు. మ‌రాఠా రాజ‌కీయాలపై చెరిగిపోని ముద్రవేసిన వృద్ధనేత ప‌వార్‌‌.. వయసును కూడా లెక్కచేయకుండా కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అయితే, అజిత్ రూపంలో శరద్ పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కానీ, గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తే.. ప్రస్తుతం ఆ అనుభవం పవార్‌కు ఎదురయ్యింది.1967లో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు పవార్‌.. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పాల్గొని విజయం సాధించారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన శరద్ పవార్.. ఫలితాలు వెల్లడయిన మర్నాడే విబేధాల కారణంగా ఆ పార్టీని వీడారు. కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ చీల్చి నాటి సీఎం వసంత్ దాస్‌ పాటిల్కు ఝలక్ ఇచ్చారు.సోషలిస్ట్‌ పార్టీ తరఫున విజయం సాధించి, ప్రొగ్రెసివ్ ఫ్రంట్ నెల‌కొల్పి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. 38 ఏళ్లకే అత్యంత పిన్న వయసులో మహారాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టిన నేతగా గుర్తింపు పొందారు. స‌రిగ్గా ఇప్పుడు అదే అనుభవం పవార్‌కు ఎదుర‌వ‌డం విశేషం. అజిత్ ప‌వార్ వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ట్టు స‌మాచారం. ఇది వృద్ధ‌నేతకు ఇబ్బంది కలిగించే అంశ‌మే.

Related Posts