బంగ్లా అమ్మాయిలతో బెజవాడలో వ్యభిచారం
విజయవాడ, నవంబర్ 23,
విజయవాడలో హైటెక్ వ్యభిచారం సంచలనం కలిగించింది. విదేశీ యువతులను రప్పించి మరీ వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. భారీగా డబ్బులు ఆశచూపి బంగ్లాదేశీ యువతిని విజయవాడ తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. వ్యభిచార నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.బంగ్లాదేశ్ లోని జూత్‌పూర్‌కి చెందిన 17 ఏళ్ల బాలికకు భారీగా డబ్బు ఆశ చూపి విజయవాడ తీసుకొచ్చినట్లు వెల్లడైంది. ఆరునెలలకు మూడు లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియన వ్యక్తులు ఇద్దరు ఆమెను సరిహద్దు దాటించి కోల్‌కతా వరకు చేర్చారు. అక్కడి నుంచి రాహుల్, ప్రియ అనే మరో ఇద్దరు బాలికను విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి జనార్ధన్ అనే వ్యక్తి జత కలిశాడు. జనార్థన్, ప్రియ కలిసి బాలికను హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో పంపారు.విజయవాడలో బస్సు దిగిన బంగ్లాదేశ్ బాలికను రవి అనే వ్యక్తి రిసీవ్ చేసుకుని మూడు రోజుల పాటు తన వద్దే వ్యభిచారం చేయించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ అమ్మాయిని సూరవరపు మహేష్ అనే వ్యక్తికి అప్పజెప్పాడు. అతను వరప్రసాద రెడ్డి అనే మరో వ్యక్తితో కలిసి బాలికతో వ్యభిచారం చేయిస్తున్నాడు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటికి రోజూ జనం వచ్చిపోతుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ముఠా గుట్టురట్టైంది.విజయవాడ పోలీసులు వ్యభిచార దాడులు చేసి బాలికతోపాటు నిందితులు ప్రసాద్‌రెడ్డి, మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక మైనర్ కావడంతో వైద్య పరీక్షల అనంతరం జువైనెల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలిక మాటలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆమెకు అప్పటికే పెళ్లైందని.. మూడున్నరేళ్ల బాబు కూడా ఉన్నట్లు చెప్పడంతో షాక్ తిన్నారు. నిర్వాహకులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.