యలమంచిలిని దూరం పెట్టేశారు..
విజయవాడ,
విజయవాడ రాజకీయాల్లో ఆసక్తి కర చర్చ సాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వైసీపీ నాయకులు ఏ ఇద్దరు ఫోన్లు చేసుకున్నా.. ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. దీంతో ఈ విషయానికి ఎంతో ఆసక్తి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న విజయవాడ వైసీపీ నాయకుడు బొప్పన భవకుమార్‌కు వైసీపీ అధినేత, సీఎం జగన్ నుంచి అద్బుతమైన హామీ ఒకటి లభించిందని తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఆయన తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.వాస్తవానికి ఎన్నికలకు ముందు కొన్ని నెలల వరకు ఆయన కార్పొరేటర్‌గా ఉంటూ విజయవాడ తూర్పు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పార్టీలో చేరడంతో ఆయనకు తూర్పు పగ్గాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అలిగారు. చివర్లో పీవీపీ ఒత్తిడి మేరకు భవకుమార్‌కే తూర్పు సీటు దక్కింది. అయితే గద్దె రామ్మోహన్‌పై ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత పార్టీలో ఏదైనా నామినేటెడ్ పదవి దక్కుతుందని అనుకున్నా.. ఇప్పటి వరకు ఆయనను పట్టించుకున్న నాథుడు కనిపించలేదు.
పీవీపీ అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న బొప్పన భవకుమార్ పీవీపీ ఒత్తిడి మేరకు సీటు దక్కించుకున్నా చివరకు వాళ్లిద్దరు కూడా ఓడిపోయారు. ఇదిలా వుంటే, ఇటీవల టీడీపీ నుంచి యువనాయకుడు అవినాష్ దేవి నేని జంప్ చేసిన జగన్ పార్టీలో చేరిపోయారు. ఆయన మనసులో కోరిక మేరకు తూర్పు పీఠంపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఇప్పటి వరకు ఇక్కడ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న బొప్పన భవకుమార్ లోను ఆయన వర్గంలో అలజడి రేగింది.
చివరకు బొప్పన భవకుమార్ గ్యాంగ్ అంతా పీవీపీపై ఒత్తిడి చేయడంతో ఆయన నేరుగా జగన్ సన్నిహితుడు, ప్రధాన కార్యదర్శి విజయసాయితో చర్చించారని, ఈ క్రమంలోనే బొప్పన భవకుమార్ కు వచ్చే స్థానిక ఎన్నికల్లో విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఛాన్స్ ఇస్తామని, తూర్పు సీటును అవినాష్‌కు కేటాయిస్తామని ఆయన చెప్పినట్టు జోరుగా చర్చ సాగుతోంది. గతంలో వైసీపీ తరపున కార్పొరేటర్‌గా విజయం సాధించిన బొప్పన భవకుమార్ కు విజయవాడలోని అత్యంత రద్దీ ప్రాంతం, కమర్షియల్ ప్రాంతం పడమటలో మంచి పేరుంది. దీంతో ఆయనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా విజయవాడ కార్పొరేషన్‌లో పాగా వేయొచ్చని… పైగా కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని… వైసీపీ భావిస్తున్నట్టు నాయకులు చర్చించుకోవడం కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.