పక్క చూపులు చూస్తన్న తమ్ముళ్లతో టెన్షన్
గుంటూరు, నవంబర్ 25
తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ పార్టీ నేతల తీరు అధినేత చంద్రబాబుకి చుక్కలు చూపిస్తుంది. ఇన్నాళ్లు నమ్మకంగా ఉన్న ఒక్కొక్కరు పక్క చూపులు చూడటంతో చంద్రబాబుకి ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. రాజకీయంగా బలపడతామని ఆయన ఒక పక్కన జిల్లాల పర్యటనల్లో చెప్తున్నా ఒక్క నేత కూడా నమ్మడం లేదనే అభిప్రాయం వినపడుతోంది. ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇప్పటికే పార్టీ మారిపోయారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీ కి గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే ఆయన నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆయన చేరక ముందే మరో కీలక నేత ఆ విధంగా సంకేతాలు ఇస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యే అయిన ధూళిపాళ్ల నరేంద్ర పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ గెలిచినప్పుడే ధూళిపాళ్ల నరేంద్ర బాబుకు దూరమయ్యారు. ఐదుసార్లు గెలిచినా మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ధూళిపాళ్ల నరేంద్ర ఐదేళ్ల పాటు బాబుతో పాటు అటు లోకేష్‌తోనూ అంటిముట్టనట్టుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు.ఇటీవల ఒక భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే నారా లోకేష్ నియోజకవర్గంలోకి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అప్పుడు ధూళిపాళ్ల నరేంద్ర దూరంగా ఉన్నారు… దీనికి కారణం ఏంటి అని పలువురు ఆరా తీయగా ఆయన స్వామి మాలలో ఉన్నారని అందుకే రాలేదని కొందరు చెప్పారు. చావు ఇంటికి వెళ్ళకూడదు కాబట్టి రాలేదని అన్నారు. సరే అది పక్కన పెడితే నియోజకవర్గంలో కొంత మందితో లోకేష్ సమావేశమయ్యారు. ఆ సమయంలో కూడా ధూళిపాళ్ల నరేంద్ర దూరంగా ఉన్నారు. దీనిపై ఆయన నుంచి ఏ విధమైన ప్రకటన రాలేదు.ధూళిపాళ్ల నరేంద్ర లోకేష్‌ను ఎంత మాత్రం పట్టించుకోకపోవడానికి అసలు కారణం ఏంటి ? అనేది అర్ధం కాలేదు. ఇప్పుడు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన బిజెపితో నేతలతో టచ్ లో ఉన్నారని జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీ నారాయణతో ధూళిపాళ్ల నరేంద్రకు మంచి సంబంధాలు ఉన్నాయని త్వరలో పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు. అటు వైసీపీ నుంచి కూడా ఆయనకు పిలుపు వచ్చినా అందుకు ధూళిపాళ్ల నరేంద్ర స్పందించలేదని, బీజేపీ విషయంలో సానుకూలంగా ఉన్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలకు ముందే వైసీపీ వ్యవహారాలు నడిపించే ఓ కీలక నేత ధూళిపాళ్ల నరేంద్రను పార్టీలోకి ఆహ్వానించారునువ్వు అక్కడ ఐదుసార్లు గెలిచినా మంత్రి పదవి రాలేదు… అన్నీ అవమానాలే.. మా పార్టీలోకి వస్తే పొన్నూరు సీటుతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో ఈ ఆఫర్‌కు ధూళిపాళ్ల నరేంద్ర టెంప్ట్ అయ్యారట కూడా. అయితే పయ్యావులతో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు వారించడంతో ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ నుంచే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు ధూళిపాళ్ల నరేంద్రకు లోకేష్‌తో ఎంత మాత్రం పొసగడం లేదని కూడా తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ధూళిపాళ్ల నరేంద్ర సైకిల్‌పై కష్టాల జర్నీ కంటిన్యూ చేస్తారా ? లేదా ? తన దారి తాను చూసుకుంటారా ? అన్నది చూడాలి.