కుమార భంగం తప్పదా
బెంగళూర్, నవంబర్ 25
కర్ణాటకలో జనతాదళ్ ఎస్ మొత్తం 12 స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఈ పన్నెండు స్థానాల్లో విజయం సాధించిపెట్టే బాధ్యతను మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన నెత్తికెత్తుకున్నారు. మిగలిన మూడు స్థానాల్లో ఒకచోట కాంగ్రెస్ అభ్యర్థికి, మరోచోట స్వతంత్ర అభ్యర్థికి జనతాదళ్ ఎస్ మద్దతు ప్రకటించింది. కర్ణాటకలో వచ్చే నెల 5వ తేదీన పదిహేను నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసిన జనతాదళ్ ఎస్ ఈ ఉప ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. పొత్తు పెట్టుకోవడం వల్ల నాయకుల్లో, క్యాడర్ లో నిస్తేజం అలుముకోవడమే కాకుండా, అనేక ప్రాంతాల్లో ముఖ్య కార్యకర్తలు పార్టీని వీడుతుండటం కుమారస్వామి, దేవెగౌడలను ఆందోళనలో పడేసింది. అందుకోసమే ఇక పొత్తులు ఏపార్టీతో పెట్టుకోకూడదన్న నిర్ణయానికి వచ్చారు.పార్లమెంటు ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ కు ఘోరమైన పరాభవం ఎదురైంది. సాక్షాత్తూ దేవెగౌడ ఓడిపోయారు. అలాగే కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ కూడా మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నేతలు సహకరించకపోవడం, రెండు పార్టీల ఓట్లు బదిలీ కాకపోవడం వల్లనే తాము ఓటమి పాలయ్యామని దేవెగౌడ సయితం తర్వాత బహిరంగంగానే చెప్పారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు.అందుకే ఈ ఉప ఎన్నికల్లో తమకు పట్టున్న 12 నియోజకవర్గాల్లోనే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా కుమారస్వామి దగ్గరుండి చూసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఓట్లు చీలి తాము లబ్ది పొందుతామని కుమారస్వామి భావిస్తున్నారు. దేవెగౌడ కూడా కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో ప్రచారం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పన్నెండింటిలో ఎన్నింటిలో గెలిచి కుమారస్వామి తన సత్తా చాటతారన్నది ఆసక్తిగా మారింది. జేడీఎస్ ఎవరి ఓట్లకు, సీట్లకు గండి కొడుతుందన్నదీ అర్థంకాకుండా ఉంది.