ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ అధికార ప్రతినిథి సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడుతూ ఈసీ చాలా కీలక నిర్ణయం తీసుకుందన్నారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను శాసనసభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటిస్తూ రాష్ట్రపతికి సిఫారసు చేసిందన్నారు. కేజ్రీవాల్ 2015 మార్చిలో ఈ ఎమ్మెల్యేలను పార్లమెంటులో సెక్రటరీలుగా నియమించినప్పుడే, ఆ చర్య తప్పు అని, రాజ్యాంగ విరుద్ధమని ఆయనకు తెలుసునన్నారు. బాగా తెలిసినప్పటికీ ఆయన ఆ నియామకాలు చేశారన్నారు. సత్యేంద్ర జైన్ వంటివారిపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. తాజాగా 20 మందిపై అనర్హత వేటు పడిందన్నారు. గతంలో కేజ్రీవాల్ మంత్రివర్గంలో కొందరు మంత్రులు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నైతిక ప్రమాణాలను పాటిస్తూ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.