తట్ట ఇసుక కూడ అక్రమ రవాణా కాకూడదు
ఏలూరు,
జిల్లాలో ఒక్కతట్ట ఇసుక కూడా అక్రమరవాణా జరుగకుండా మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారంఉదయం ఇసుక సేకరణ, సరఫరాపై పోలీస్ , మైనింగ్ , పంచాయతీ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇసుక సేకరణపై ప్రత్యేకదృష్టిపెట్టి ఒక కార్యాచరణతో ముందుకువెళ్లడంవల్ల ఇసుక కష్టాలను పూర్తిగా అధిగమిం చగలిగామని అన్నారు. వాతావరణం అన్నివిధాలా అనుకూలంగా ఉండటంతో జిల్లాలో అందుబాటులో వున్న అన్ని పద్దతులద్వారా సమృద్దిగా ఇసుకను సేకరించి గుట్టలుగా నిల్వచేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఆన్లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకున్న కష్టమర్లకు సకాలంలో త్వరితగతిన ఇసుక సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం తోపాటు ఇసుక రీచ్లలో అక్రమ రవాణా, అవకతవకలకు ఏమాత్రం అవకాశం లేనివిధంగా మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. ఇసుక అక్రమంగా తరలించినా, అవసరానికి మించి ఇసుకను నిల్వచేసినా, ప్రభుత్వం నిర్దేశించిన ధరకంటే ఎక్కువ రేటుకు విక్రయించినా ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని కలెక్ట ర్ హెచ్చరించారు. అక్రమ రవాణాచేసే వాహనాలను సీజ్ చేయడంతోపాటు సంబంధిత వ్యక్తులకు రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రెండులక్షల రూపాయలవరకు జరిమానా విధించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. జిల్లానుండి ఒక్కతట్టఇసుక కూడా అక్రమ రవాణా జరిగేందుకు అష్కారంలేని విధంగా పోలీస్ అధికారులు అవసరమైన ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటుచేయడంతోపాటు, తగినంతమంది సిబ్బందిని నియమించుకోవాలని పోలీస్ అధికారులకు కలెక్టర్ సూచించారు. అవకతవకలు, అక్రమరవాణా, అక్రమ నిల్వలు, అధికధరకు ఇసుక విక్రయిస్తున్నట్లు ఎటువంటి పిర్యాదు వచ్చినా అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని, చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇసుక ఆన్లైన్ బుకింగ్ లో ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ బుకింగ్ విధానం మరింత సరళీకృతం చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇసుక ర్యాంపులలో సిబ్బంది అందుబాటులో వుండేలా, బుక్ చేసుకున్న కష్టమర్లకు ఇసుక రవాణాలో లారీ , ట్రాక్టర్ యజమానులు కష్టమర్లకు సహకరించేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని పోలీస్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు అవసరమైనంత మేర ఇసుక అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పోలీస్, పంచాయతీ, ఇతర సంబంధిత శాఖలు ఇచ్చిన సూచలను పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులతో ప్రజలకు మరింత త్వరగా, సక్రమంగా ఇసుక అందేలా చర్యలు చేపడతామని కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల రాజు చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్ది, డిఐజి ఎ.ఎస్ ఖాన్,డిఎస్పి లు దిలీస్ కిరణ్, రాజుశేఖర్ రెడ్ది, మైనింగ్ ఎడి వైఎస్ బాబు, జిల్లాపంచాయతీ అధికారి టి .విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.