బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రమాద ఘటనపై కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ :
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రమాద ఘటనపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై ముగ్గురు సభ్యులతో మంత్రి కేటీఆర్ కమిటీ ఏర్పాటు చేశారు. చీఫ్ ఇంజినీర్ శ్రీధర్‌తో పాటు లీ అసోసియేట్స్ ప్రైవేటు సంస్థతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫ్లై ఓవర్ డిజైన్, ప్రమాద నివారణ చర్యలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై శనివారం మధ్యాహ్నం 104 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు ఓ మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అంతే.. ఎడమవైపు ఉన్న రెయిలింగ్‌ను అదే వేగంతో ఢీకొని పైనుంచి కింద ఐటీ కారిడార్ మలుపు వద్ద పల్టీ కొట్టి చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఆ సమయంలో అక్కడ నిలుచుని ఉన్న సత్యవేణి (56) అనే మహిళపై కారు నేరుగా పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. పక్కనే ఉన్న ఆమె కుమార్తె ప్రణీత (26), కుర్బా (26), ఆటోడ్రైవర్ బాలునాయక్ (38) తీవ్రంగా గాయపడ్డారు.