సమ్మె విరమించిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు
52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపటి నుంచి కార్మికులందరూ డ్యూటీలకు హాజరుకావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. ఇదే విషయమై సోమవారం మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు.. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత యాజమాన్యం నుంచి కనీసం స్పందన రాలేదని అన్నారు. ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించిందన్నారు. ప్రభుత్వ నిర్బంధకాండ మధ్య నిరసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కార్మికులందరూ విధులకు హాజరవ్వాలని అశ్వత్థామరెడ్డి కోరారు. సెకండ్ షిప్ట్ వాళ్లు కూడా విధులకు రావాలన్నారు. ఇన్ని రోజులు బస్సులు నడిపిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపటి నుంచి డ్యూటీలకు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేశారు.