ఆర్టీసీపై తాడోపేడో
క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ : ప్రైవేట్ పై కేబినెట్ లో చర్చ
హైద్రాబాద్, నవంబర్ 26
ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ భేటీ కొనసాగనుంది. 29వ తేదీన కూడా మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలో ఇతర అంశాలతో పాటు ఆర్టీసీ అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.తమను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో డిపోల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపోల వద్దకు వస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు మాత్రమే డిపోల్లోకి పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది.చట్టవిరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు విధుల్లో చేర్చుకోవడం సాధ్యంకాదని ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ స్పష్టంచేశారు. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ‘ఓ వైపు పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరుతామని చెప్తున్నారు. తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలో కూడా ఉండదు’ అని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో సునీల్‌శర్మ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయాలని చెప్పలేదని స్పష్టంచేశారు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి.. ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించారన్నారు. కార్మికులు ఇప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో గౌరవ హైకోర్టు చెప్పినదాని ప్రకారం కార్మికశాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారని, దాని ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుందని, అప్పటివరకు అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ‘తమంతట తాముగా సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదు.