కుప్పం పై దృష్టి పెట్టిన జగన్
చ, నవంబర్ 26
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాకా. చంద్రబాబు ఇలాకాలో తిరుగులేని ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు. ఓటమి లేని నేతగా ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు ఎర్త్ పెడుతున్నారు వైసీపీ నేతలు. 1989 నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడిది. ఈ నియోజకవర్గం నుంచి 1969లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి ఏపీ వజ్రవేలు చెట్టి గెలిచారు. తరువాత డి. వెంకటేశం రెండుసార్లు ఇండిపెండెంట్‌గా గెలిచారు. 1978లో దొరస్వామి నాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత ఇక్కడ టీడీపీ విజయఢంకా మోగిస్తూ వస్తోంది.1983, 85లో ఎన్.రంగస్వామినాయుడు టీడీపీ నుంచి గెలువగా, ఇక 1989 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడే గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న ఈనియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు ఇప్పుడు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ గత రెండు ఎన్నికల్లో చంద్రబాబుకు నిద్రలేకుండా చేసింది. గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీతోనే చంద్రబాబు ఢీ కొట్టారు. చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ ఆధినేత జగన్ మోహన్ రెడ్డి తనదైన పద్దతిలో ఇప్పుడు ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో చంద్రబాబు కు ఎర్త్‌పెట్టి అక్కడ ఓడించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు జగన్.2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అనుచరులకు చుక్కలు చూపుతోంది జగన్ సర్కారు. నిత్యం అధికారులతో వైసీపీ నేతలు సమీక్షలు జరుపుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ అంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుంది. ఇక టీడీపీలోని యువతను తమవైపుకు ఆకర్షించే పనిలో పడింది వైసీపీ. అందుకే టీడీపీలో క్రియాశీలకంగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులను వైసీపీలో చేర్చుకుంటూ టీడీపీని దెబ్బ కొడుతున్నారు. కుప్పంలో అధికారులను అండతో అధికార పార్టీ నేతలు దూసుకుపోతున్నారు. ప్రభుత్వాధికారుల సహాకారం, పోలీసుల అండతో వైసీపీ దూకుడు మీదుంది. కుప్పంలో జరుగుతున్న ప్రతి పనిని తమ కనుసన్నల్లో జరిగేలా వైసీపీ నేతలు కార్యాచరణ సిద్దం చేశారు. అందుకు తగిన విధంగా ప్రణాళికలు రచిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.ఎంత చంద్రబాబు నియోజకవర్గం అయినా అధికారులు కూడా అధికారంలో ఉన్న పార్టీ కావడంతో వైసీపీ నేతలు చెప్పిన పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో టీడీపీ చేసిన పనినే ఇప్పుడు వైసీపీ కూడా చేస్తోంది. అప్పుడు టీడీపీకి అధికారులు ఎలా సహాకరించారో ? ఇప్పుడు వైసీపీకి సహకరిస్తున్నారు. అధికారులను గతంలో టీడీపీ ఎలా ఉపయోగించుకుందో ? ఇప్పుడు వైసీపీ అలాగే ఉపయోగించుకుంటోంది. వైసీపీ నేతలు కుప్పంలో దూకుడు మీద ఉండటంతో టీడీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇక గత ఎన్నికల్లోనే చంద్రబాబు మెజార్టీ 30 వేలకు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వైసీపికి మెజార్టీ వచ్చింది. ఇక ఇప్పుడు వైసీపీ దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ చంద్రబాబు కు గెలుపు ఈజీ కాదనే అర్థమవుతోంది.