మమతలో కనిపిస్తున్న ఆందోళన
కోల్ కత్తా, నవంబర్ 26
మమత బెనర్జీ ఫైర్ బ్రాండ్. రాజకీయ ఎత్తులను బాగా తెలిసిన నేత. తలపండి దశాబ్దాలుగా వేళ్లూనుకున్న కమ్యునిస్టులనే మమత మట్టి కరిపించారు. అలాంటి మమత బెనర్జీ లో కొంత ఆందోళన కన్పిస్తుంది. బీజేపీ దెబ్బతీస్తుందేమోనన్న అనుమానం మమతలో బయలుదేరినట్లే ఉంది. మమత ముందు జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మమత బెనర్జీ ఏ ఒక్క అవకాశమూ ఇవ్వకూడదని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మరో ఏడాదిన్నరలో జరగబోతున్నాయి. అయితే గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు మమతబెనర్జీకి చెమటలు పట్టించాయనే చెప్పాలి. 42 లోక్ సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 18 స్థానాలను గెలుచుకోవడమంటే సామాన్య విషయమేమీ కాదు. ఆషామాషీ కాదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. బీజేపీ సంస్థాగతంగా కొంత బలపడి ఉండవచ్చు. క్యాడర్ లోనూ, ఓటర్లలోనూ మమత అంటే మొహం మొత్తి ఉండవచ్చు. దీంతో పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం ఇక అసెంబ్లీ ఎన్నికలపైనే మమత బెనర్జీ దృష్టి పెట్టారు.భారతీయ జనతా పార్టీ ఒకసారి రాష్ట్రంలో కాలుపెడితే ఇక నిలువరించడం కష్టమని మమత బెనర్జీకి తెలియంది కాదు. అందుకే ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని మమత బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ముందుగా క్యాడర్ లో ఆత్మస్థయిర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల వారీ అభివృద్ధి కార్యక్రమాలకు కార్యాచరణను రూపొందించి వేగవంతం చేస్తున్నారు. కమ్యునిస్టులు, కాంగ్రెస్ పార్టీ పెద్ద పోటీ కాకపోయినా వారు తమ ఓట్లు చీల్చకుండా మమత బెనర్జీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మమత బెనర్జీ ఎంఐఎం పై కూడా విరుచుకుపడ్డారు. బెంగాల్ లో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. గతంలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే ముస్లింలు మమత వైపు చేరిపోయారు. బీజేపీకి ఎటూ వారు ఓటు వేయరు. అయితే ఎంఐఎం పోటీ చేస్తే వారు అటు మళ్లే ప్రమాదముందని గ్రహించిన మమత బెనర్జీ తమ రాష్ట్రంలోకి ఎంఐఎంను అడుగుపెట్టనివ్వకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంఐఎంకు ఓటువేస్తే బీజేపీ లబ్ది పొందుతుందని నూరిపోస్తున్నారు. ఎంఐఎంను అమ్ముడుపోయే పార్టీగా సంచనల కామెంట్స చేశారు. మహారాష్ట్రలో ఎంఐఎం కారణంగా బీజేపీ, శివసేన లబ్ది పొందిన విషయాన్ని మమత బెనర్జీ గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద మమత బెనర్జీ చేస్తున్న ముందస్తు ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.