ట్రిపుల్ ఐటీలో సౌకర్యాలు డబుల్ (కృష్ణాజిల్లా)
నూజివీడు, నవంబర్ 26 : నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు మరిన్ని వసతులు కల్పించాలని ఆర్జీయూకేటీ యాజమాన్యం భావిస్తోంది. బహుళప్రయోజన క్రీడా ప్రాంగణం (మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్)తో పాటు సౌర విద్యుత్తు వ్యవస్థ, స్నాతకోత్సవం, అకడమిక్ క్లస్టర్ భవనాలు నిర్మించనుంది. ఇటీవల సేకరించిన 70 ఎకరాల భూమిని వాటికి కేటాయించాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మాస్టర్ ప్లాన్ తయారీ కోసం త్వరలో ఓ బృందం ట్రిపుల్‌ఐటీకి రానుంది. ట్రిపుల్‌ఐటీలో సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుకు నెడ్‌క్యాప్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న భవనాలపై ఫలకాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాని నేపథ్యంలో, నాలుగు ఎకరాల స్థలం కేటాయించాలని సంస్థ కోరింది. ప్రాంగణం మొత్తానికి సౌర విద్యుత్తుని సరఫరా చేయాలంటే 2 కె.వి. విద్యుత్తు లైను అవసరం అవుతుంది. ప్రస్తుతానికి 1 కె.వి. లైను ఉంది. సౌర వ్యవస్థ అందుబాటులోకి వస్తే విద్యుత్తు ఖర్చులు తగ్గుతాయి. ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీ విద్యుత్తు శాఖకు యూనిట్‌కు రూ.11 చొప్పున చెల్లిస్తోంది. అదే సౌర విధానంలో అయితే యూనిట్‌కు రూ.3.99 మాత్రమే పడుతుంది. విద్యా సంస్థకు రూ.7 వరకు ఆదా అవుతుందని డైరెక్టర్ తెలిపారు. ట్రిపుల్ ఐటీలో యోగా, క్రీడల్లో ప్రతిభ చూపే విద్యార్థులు ఉన్నారు. యోగా విద్యార్థులు ఇప్పటికే రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. అదే విధంగా క్రీడల్లో సైతం రాణించగల విద్యార్థులు కూడా ఉన్నారు. వారందరినీ ప్రోత్సహించడానికి మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ట్రిపుల్‌ఐటీ యాజమాన్యం పూనుకుంది. వాలీబాల్, నెట్‌బాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, కబడ్డీ కోర్టులు, సింథటిక్ రన్నింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేస్తే విద్యార్థులు క్రీడా నైపుణ్యాలకు పదును పెట్టవచ్చనేది అధికారుల యోచన. కాంప్లెక్స్ నిర్మాణానికి వీలుగా శాప్ అధికారులు ట్రిపుల్‌ఐటీని సందర్శించి వెళ్లారు. అందుకు 6 ఎకరాల స్థలాన్ని అడిగారు. మాస్టర్ ప్లాన్ కమిటీ పచ్చ జెండా ఊపితే శాప్ అధికారుల ఆమోదానికి పంపుతారు. సుమారు రూ.5 నుంచి రూ.10 కోట్ల వ్యయంతో కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో ఆరు ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు ఉన్నాయి. వాటి తరగతుల నిర్వహణకు మూడు అకడమిక్ బ్లాక్స్ ఉన్నప్పటికీ, ఆరు బ్రాంచ్‌ల విద్యార్థులు ప్రయోగాలు చేయడానికి సరిపడా ల్యాబ్‌లు లేవు. ప్రస్తుత అకడమిక్ బ్లాకులకు వెనుక భాగంలో ఉండే స్థలంలో ఆరు బ్రాంచ్‌లకు సంబంధించి ప్రయోగ శాలలు ఏర్పాటు చేయాలనేది యాజమాన్యం ఆలోచన. ఇది కార్యరూపం దాలిస్తే విద్యార్థుల వృత్తి నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు. క్యాంపస్‌లో ఆరు వేలమందికి పైగా విద్యార్థులు ఉంటారు. ఏదైనా కార్యక్రమం జరిగితే అందరూ కూర్చుని చూడటానికి వేదిక లేదు. పెద్ద కార్యక్రమాలు ఉంటే ఆరు బయటే నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే సేకరించిన 70 ఎకరాల స్థలంలో స్నాతకోత్సవ భవనం నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. త్వరలో రానున్న మాస్టర్ ప్లాన్ కమిటీ స్థలాన్ని పరిశీలించి ఎక్కడ ఏది నిర్మించాలో నిర్ధరిస్తుందని అధికారులు తెలిపారు.