YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

*ధన్వంతరి జయంతి*

*ధన్వంతరి జయంతి*

*ధన్వంతరి జయంతి*
శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని, ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.
దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా, దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరవాత అమృతకలశం, ఔషధులు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. ‘దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో, ఎర్రని కళ్లతో నల్లని దేహచ్ఛాయ కలిగి యుక్తవయస్కుడై పీతాంబరాలు, ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో, విశాలమైన వక్షస్థలంతో, సింహంవలె శక్తిని కలిగి అమృతభాండంతో అవతరించాడు’ అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది.ధన్వంతరిని విష్ణువు ‘అబ్జుడు’గా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరాడు. అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ద్వాపరయుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్పాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని, అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్తం పేర్కొంది.

సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతర కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం.

బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణజన్మ ఖండంలో ధన్వంతరి, మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి, అతడి శిష్యులు కైలాసానికి వెళ్తుండగా తక్షకుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడికి స్పృహతప్పింది. ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతణ్ని తేరుకునేట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి, ద్రోణ, పుండరీక, ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేస్తారు.

అధర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారంచేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి; శలాక్య, శల్య, విష, రసాయన, వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వవైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని, అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు.

చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావడం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్‌ సమీపంలో ‘ధన్వంతరి క్షేత్రం’ ఉంది

Related Posts