YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

గరళ గోదారి (తూర్పుగోదావరి)

గరళ గోదారి (తూర్పుగోదావరి)

గరళ గోదారి (తూర్పుగోదావరి)
రాజమహేంద్రవరం, నవంబర్ 26 :  జిల్లాలో కలుషిత జలాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. చాలా ప్రాంతాలకు తాగునీటి వనరుగా ఉన్న పంట కాలువల్లోకి వ్యర్థాలను యథేచ్ఛగా కలిపేస్తుండటంతో ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. ప్రధానంగా జిల్లాలోని పలు పంచాయతీలు,  మున్సిపాలిటీలు ఈ నీటిని శుద్ధి చేసి తాగునీటిగా సరఫరా చేస్తున్నాయి... ఇవి ఎంతవరకు సురక్షితమనేది ప్రశ్నార్థకంగా మారింది.  పవిత్ర గోదావరి జలాలు పంటకాలువల ద్వారా ప్రవహించడంతో జిల్లాలో ఖరీఫ్‌, రబీ పంటలు పండుతున్నాయి. ఏటా సుమారు 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించేందుకు ఈ జలాలే ఆధారం. జిల్లాలో 62 సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు కాలువ జలాల ఆధారంగా పని చేస్తున్నాయి. వీటిపై ఆధారపడి సుమారు 30 లక్షల జనాభా తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. వేలాది పశువులకు దప్పిక తీర్చేవివే. ఇలాంటి జీవజలాలు మానవ తప్పిదాలతో కాలుష్యం బారినపడుతున్నాయి. మృతకళేబరాలు మొదలుకుని గ్రామాల్లో ఊడ్చిన చెత్త, వివిధ వ్యర్థాలను పంటకాలువల్లో పడేస్తున్నారు. వీటినుంచే సమగ్ర రక్షిత నీటి పథకాలకు జలాలను తీసుకోవడంతో ప్రజలకు క్రమంగా నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో విచ్చలవిడిగా ఆర్వో ప్లాంట్లు వెలుస్తున్నాయి. ఎక్కువమంది ఆర్వో ప్లాంట్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇళ్లల్లోంచి మురుగునీటి తూరలు సైతం పంట కాలువల్లోకి పెట్టేస్తున్నారు. కొన్ని పంచాయతీలకు అవుట్‌లెట్లు లేకపోవటంతో డ్రెయిన్ల నుంచి వచ్చే నీటిని కాలువల్లోకి వదిలేస్తున్నారు. ప్రధానంగా పరిశ్రమలు, ఆక్వా చెరువుల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలను కాలువల్లోకి యథేచ్ఛగా విడుదల చేస్తుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కొన్ని గ్రామ పంచాయతీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పరిధిలో సెప్టిక్‌ ట్యాంకుల వ్యర్థాలను సైతం కాలువల్లోకి వదిలేస్తుండడంతో కాలుష్యం బారినపడుతున్నాయి... ఈ పరిస్థితి కోనసీమ ప్రాంతంలోని మధ్య డెల్టాలో ఎక్కువగా ఉంది. ఇంతటి తీవ్రమైన పరిస్థితులున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో జలకాలుష్యంపై రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలో తీవ్రమైన చర్చకు దారితీసింది. జలవనరుల శాఖ ఇచ్చిన నివేదిక జిల్లాలో జలకాలుష్యం పరిస్థితికి అద్దం పట్టింది. గోదావరి నది పరిధిలోని తూర్పు, మధ్య డెల్టా, పిఠాపురం బ్రాంచి కెనాల్‌ కాలువలు, ఏలేరు రిజర్వాయర్‌ పరిధిలోని కాలువల్లో పెద్ద మొత్తంలో కలుషితాలు కలుస్తున్నట్లు గుర్తించారు. పంట కాలువలకు అనుబంధంగా ఉన్న డ్రెయినేజీల్లో సైతం ఇదే పరిస్థితి ఉందని తేల్చారు. జిల్లాలో వ్యర్థజలాలు కలిసే 3,500 ప్రదేశాలను గుర్తించగా, మధ్య డెల్టాలోనే 2,000 చోట్ల కలుషితాలు కాలువల్లో కలుస్తున్నట్లు నిర్థారించారు. కోనసీమ ప్రాంతంలో ఆక్వా చెరువుల నుంచి వచ్చే కలుషిత నీటిని శుద్ధి చేయకుండానే వదిలేస్తున్నట్లు తేల్చారు. జిల్లాలో రాజమహేంద్రవరం, కొత్తపేట, అమలాపురం, రావులపాలెం, సామర్లకోట, పిఠాపురం, మండపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం, తదితర ప్రాంతాల్లోని గోదావరి, ఏలేరు కాలువల్లో వ్యర్థజలాలు కలుస్తున్నట్లు గుర్తించారు. తూర్పు డెల్టా, కడియం నుంచి సామర్లకోట వరకు ఉన్న గోదావరి కాలువల్లో ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల నుంచి వచ్చే కలుషిత జలాలు కలుస్తున్నాయి. జిల్లాలో గోదావరి, ఏలేరు కాలువల్లోకి కలుస్తున్న వ్యర్థ జలాల వివరాలను జలవనరులు, కాలుష్య నియంత్రణ మండలి శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మిషన్‌ గోదావరి ప్రాజెక్టును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నివేదికను అందజేయనున్నారు. గోదావరి కాలువల్లోకి కలుషిత జలాలు కలవకుండా చర్యలు చేపట్టడానికి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఇప్పటికే మిషన్‌ గోదావరికి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారిని నియమించారు. ఇది త్వరలో కార్యరూపం దాల్చనున్న నేపథ్యంలో తాగునీటి కాలుష్యాన్ని పూర్తిగా నివారించడానికి మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కలుషిత జలాల నివారణ ప్రక్రియను దీని ద్వారా చేపడతారని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద చట్టం తీసుకువచ్చి, పంచాయతీ, మున్సిపాల్టీల, జలవనరులు, కాలుష్య నియంత్రణ మండలి అమలు చేయాల్సిన మార్గదర్శకాలను రూపొందించనున్నారు. ఈ మిషన్‌ సాకారమైతే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Related Posts