కేంద్ర నిధులే మండల జిల్లా పరిషత్ లకు దిక్కు
వరంగల్, నవంబర్ 27,
నిధుల్లేక, చేసేందుకు ఏమీ లేక జిల్లా, మండల పరిషత్ కొట్టుమిట్టాడుతున్నాయి. ఎలాంటి నిధులూ లేక మొక్కుబడిగా మారిపోయామని, అసలు పదవుల్లో ఉన్నది ఎందుకో అర్థం కావడం లేదని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాపోతున్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్ర సర్కారు కూడా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీ, మండల పరిషత్ సమావేశాల్లో ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిలదీస్తున్నారు. 2015 నుంచీ అమల్లో ఉన్న 14వ కేంద్ర ఆర్థిక సంఘం నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు కేటాయిస్తోందని, కనీసం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నుంచైనా నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఇచ్చినట్టుగా జిల్లా, మండల పరిషత్ లకు నిధులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.గతంలో స్థానిక సంస్థలకు బీఆర్జీఎఫ్ (బ్యాక్ వర్డ్ రీజియన్ ఫండ్)లో భాగంగా నిధులు వస్తుండేవి. ఇప్పుడు అవి కూడా రావటం లేదని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు గుర్తు చేస్తున్నారు. వివిధ జిల్లాల్లో మైనింగ్ సెస్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. మొదట్లో ఈ సొమ్ము నేరుగా స్థానిక సంస్థలకు వెళుతుండేది. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక.. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలకు మళ్లించారు. ఆ నిధులను జిల్లా, మండల పరిషత్ లకు ఇవ్వాల్సి ఉన్నా సర్కారు పట్టించుకోవడం లేదని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాపోతున్నారు. ఇక రిజిస్ట్రేషన్ల నుంచి స్టాంప్ డ్యూటీ స్థానిక సంస్థలకు అందాల్సి ఉందని, ఆ సొమ్ము కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. హైదరాబాద్ శివారు జిల్లాల్లో వందల కోట్ల రూపాయల మైనింగ్ సెస్ జిల్లా పరిషత్ లకు రావాల్సి ఉందని గుర్తు చేస్తున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.533 కోట్ల మైనింగ్ ఫండ్ బకాయి ఉందని, హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర సర్కారు చెల్లించడం లేదని చెప్తున్నారు.ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఆరేళ్లకోసారి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలను ఎన్నుకుంటున్నారు. ఇలా లోకల్ బాడీస్ నుంచి గెలిచిన ఎమ్మెల్సీలు కూడా జిల్లా, మండల పరిషత్లను పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్సీ కోటా నిధుల నుంచైనా స్థానిక సంస్థలకు కేటాయించడం లేదని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాపోతున్నారువచ్చే ఏడాది మార్చి 31తో 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగుస్తుంది. తర్వాత 15వ ఆర్థిక సంఘం అమల్లోకి వస్తుంది. 13వ ఆర్థిక సంఘం వరకు కూడా కేంద్రం నుంచి జిల్లా, మండల పరిషత్లకు నిధులు అందేవి, అక్కడి నుంచి గ్రామ పంచాయతీలకు వెళ్లేవి. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘంలో నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఇటీవల కేంద్ర బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా గతంలో తరహాలో జిల్లా, మండల పరిషత్ లకు నిధులివ్వాలని సీఎం కేసీఆర్ ఆ బృందానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల పరిషత్లు 15వ ఆర్థిక సంఘంపైనే ఆశలు పెట్టుకున్నాయి. అయితే రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను కేంద్రం పెంచిన నేపథ్యంలో స్థానిక సంస్థలకు నిధులిస్తుందా, లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. అందువల్ల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు ఇవ్వాలని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కోరుతున్నారు.