YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

 తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

 తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
హైద్రాబాద్, నవంబర్ 27,
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రం ఆధీనంలోని వార్షిక పరిశ్రమల సర్వేలో పేర్కొంది. ప్రతి ఏడాది వార్షిక పరిశ్రమల సర్వేను నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ నిర్వహిస్తుంది. ఈ సర్వే ప్రకారం 2014-15లో రాష్ట్రంలో పరిశ్రమలు 14,427 ఉండగా, 2017-18 నాటికి 15,263కు పెరిగాయి. పరిశ్రమల్లో పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. 38.3 శాతం మేరకు పెట్టుబడులు పెరిగాయి. 2014-15లో రూ.87,597 కోట్లు ఉండగా, 2019 నాటికి రూ.1.75 లక్షల కోట్లకు పెరిగాయి. 2015లో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు 5.85 లక్షల మంది ఉండగా, ప్రస్తుతం 6.69 లక్షల మందికి పెరిగారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు తెలంగాణ పరిశ్రమల రంగాన్ని విశే్లషిస్తే మొత్తం 10 వేల పరిశ్రమలు గత ఐదేళ్లలో వచ్చాయి. ఇందులో 6,783 పరిశ్రమలను రూ.75,250 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని వల్ల 5.06 లక్షల మందికి ఉపాధి లభించింది. వివిధ దశల్లో 639 పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో రూ.22,244.67 కోట్లు పెట్టుబడులు, ప్రాథమిక దశలో 616 పరిశ్రమలు ఉండగా, రూ.46.63 వేల కోట్లు చొప్పున పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకోసం దార్శనికతతో రాష్ట్ర పరిశ్రమలు, వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ 1.5 లక్షల ఎకరాల భూమిని సేకరించింది. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో భూమిని సేకరించిన సంస్థ మరొకటి లేదు. టీఎస్‌ఐపాస్ పారిశ్రామిక విధానం పారశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉండడంతో
పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని ఇటీవల మంత్రి కేటీ రామారావు ప్రకటించిన విషయం విదితమే. రాజకీయంగా స్థిరత్వంతో కూడిన ప్రభుత్వం, హైదరాబాద్ పరిసరాల్లో మంచి వౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం, తక్కువ రేట్లకే భూములు, మానవ వనరుల లభ్యత తెలంగాణకు వరంగా మారాయి. హైదరాబాద్‌కు సమీపంలో భువనగిరి జిల్లాలో దండుమల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు దేశ వ్యాప్తంగా చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటోంది. నల్లగొండ జిల్లాలో డ్రైపోర్టును ఏర్పాటు చేస్తున్నారు. దండుమల్కాపూర్ పారిశ్రామికవాడలో కాలుష్య రహిత పారిశ్రామికవాడగా తీర్చిదిద్దారు. తొలిదశలో 440 ఎకరాల్లో ఈ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశారు. రెండవ దశలో మరో రెండు వేల ఎకరాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పారిశ్రామికవాడలో పరిశ్రమలు రూ. 1,552 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక్కడ 450 పరిశ్రమలు రానున్నాయి. 19వేల మందికి ఉపాధి లభించనుంది. యువకులకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

Related Posts