ఖరీఫ్ తో పాటు రబీకి కళకళ
నిజామాబాద్, నవంబర్ 27,
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది విస్తారంగా కురిసిన భారీ వర్షాలతో రబీ సీజన్ కళకళలాడనుంది. ప్రస్తుత రబీ సీజన్‌లోరికార్డు స్థాయిలో పంటలు పండనున్నాయి. ఈ ఏడాది గత రికార్డును తెలంగాణ రాష్ట్రం అధిగమించనుంది. రబీ సీజన్‌కు అవసరమైన పుష్కలంగా భూగర్భ జలాలు, 24 గంటల కరెంటు, ప్రాజెక్టులు, చెరువుల్లో నీళ్లు ఉండడం వల్ల రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించింది.రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో రైతులు రబీ పంటకు సమాయత్తమవుతున్నారు. అన్ని సాగునీటి ప్రాజెక్టుల జలాశయాలు, చెరువులు జల సిరితో కన్నుల పండువగా ఉన్నాయి. వ్యవసాయ శాఖ రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, యూరియా సరఫరాకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖరీఫ్ పంట ఆలస్యం కావడం వల్ల రబీకి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నా, కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖకు అందిన సమాచారం ప్రకారం..రాష్ట్రంలో 1.27 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణం ఉంది. ఇందులో గత ఏడాది రబీ సీజన్‌లో 2.14 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఈ ఏడాది ఈ నెల 23వ తేదీ వరకు 1.71 లక్షల హెక్టార్లలో పంట పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 13 శాతం ఎక్కువగా పంటలను వేస్తున్నాలరు. జిల్లాల వారీగా విశే్లషిస్తే రంగారెడ్డి జిల్లాలో 1,883 హెక్టార్లు, వికారాబాద్‌లో 14 వేల హెక్టార్లు, నిజామాబాద్‌లో 9,443, కామారెడ్డిలో 12,484, మెదక్‌లో 1,181, సంగారెడ్డిలో 10,875, సిద్ధిపేటలో 3,958, మహబూబ్‌నగర్‌లో 3,801, నాగర్‌కర్నూల్‌లో 39,654, వనపర్తిలో 18,518, గద్వాలలో 12,090, కరీంనగర్‌లో 3,292, ఆదిలాబాద్‌లో 18,550 హెక్టార్లలో విత్తనాలు వేశారు. మొక్కజొన్న, ఎర్రజొన్న, పొద్దుతిరుగుడు, వరి పంటలను రైతులు ఉత్సాహంతో వేస్తున్నారు. ఈసారి అన్ని రుతువుల్లో వర్షాలు బాగా కురిశాయి. నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం 720.4 ఎంఎం కాగా, 791.4 ఎంఎం వర్షపాతం నమోదైంది. ఈశాన్య రుతుపవనాల కాలంలో 129.5 ఎంఎంకు 44 శాతం అదనంగా 118.2 వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో గరిష్టంగా 1,572 ఎంఎం వర్షపాతం, గద్వాల జోగుళాంబ జిల్లాలో అత్యల్పంగా 516.7 ఎంఎం వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో వర్షపాతం లోటు ఉన్న జిల్లాలు లేకపోవడం విశేషం. విస్తారంగా వర్షాల వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పుష్కలంగా చేరుకున్నాయి. దాదాపు 700 టీఎంసీల జలాలు భూగర్భంలో ఉన్నాయి. 24 గంటల కరెంటు సరఫరా వల్ల రైతులు ఎటువంటి ఆందోళన లేకుండా పంటలకు నీరు తోడుకునేందుకు మంచి అవకాశం లభించిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 7.92 మీటర్ల లోతుకే భూగర్భ జలాల లభ్యత నమోదైంది. గత ఏడాది 10.35 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వెళ్లాయి. గత ఏడాదితో పోల్చితే 2.40 మీటర్ల పైకి భూగర్భ జలాలు తన్నుకుని వచ్చాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, జూరాల,తుంగభద్ర జలాశయాలు కళకళలాడుతున్నాయి. శ్రీశైలంలో 189.45 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 306 టీఎంసీలు, శ్రీరాంసాగర్‌లో 89.76 టీఎంసీలు, జూరాలలో 9.66 టీఎంసీలు, తుంగభద్రలో 94.72 టీఎంసీల నీటి లభ్యత ఉంది. తుంగభద్రలో నీటి లభ్యత వల్ల రాజోలిబండ ప్రాజెక్టు కింద పాత మహబూబ్‌నగర్ జిల్లాలో 87 వేల ఎకరాలకు నిశ్చితంగా సాగునీరు అందుతుంది. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న ఎనిమిది లక్షల ఎకరాలకు అలజడులకు తావులేకుండా సాగునీటిని అందించేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో రబీ సీజన్‌లో ఆంధ్ర, తెలంగాణ మధ్య నీటి తగాదా తలెత్తిన విషయం విదితమే. రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కృష్ణాబోర్డుకు ఫిర్యాదులు చేసుకునేవారు. రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువు, నాణ్యమైన విత్తనాలను సకాలంలో సమకూర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో, వ్యవసాయ అధికారులు ఎటువంటి ఫిర్యాదులకు తావులేకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి రైతులకు అవసరమైన సలహాలు అందిస్తున్నారు.