YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

బ్యాంకర్లు మొండి చేయి... లక్ష్యాలు ఘనం.. ఆచరణలో శూన్యం

బ్యాంకర్లు మొండి చేయి... లక్ష్యాలు ఘనం.. ఆచరణలో శూన్యం

బ్యాంకర్లు మొండి చేయి...
లక్ష్యాలు ఘనం.. ఆచరణలో శూన్యం
కర్నూలు,
రైతుల నుంచి రుణ వసూలు లక్ష్యం చేరుకోవడం లేదన్న కారణం చూపుతూ వారికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావడం లేదు.. జిల్లా వ్యాప్తంగా రూ. 33,865కోట్ల మేర లక్ష్యం కాగా రూ. 17,969కోట్లు రుణాలుగా మంజూరు చేశారు. ఇందులో రైతులకు రుణాలు ఇవ్వడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలను బ్యాంకర్లు ఎదుర్కొంటున్నారు దాంతో అన్నదాతలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేస్తూ ఆ సొమ్ము చెల్లించలేక, బ్యాంకుల్లో రుణాలు రాక ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. రైతులకు రుణాలు ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు వారు సహకరించం లేదన్న ఆరోపణ కూడా బ్యాంకర్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో రైతులకు రూ. 2,143కోట్ల స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశిస్తే బ్యాంకర్లు  10వ తేదీ నాటికి కేవలం 12.11శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో 28,498 మంది రైతులకు రూ. 259.48కోట్లు మాత్రమే అందించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. రబీ సీజన్‌లో రూ. 3,352 కోట్ల మేర లక్ష్యంగా నిర్ణయిస్తే దాదాపు పూర్తి లక్ష్యం చేరుకున్న అధికారులు రూ. 3,296 కోట్లను రైతులకు రుణాలుగా పంపిణీ చేశారు. అయితే ఈ రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారన్న కారణంగా ప్రస్తుత రబీ సీజన్‌లో రుణాలు ఇవ్వలేకపోయామని బ్యాంకర్లు చెప్తున్నట్లు వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఆశించిన పంట దిగుబడి సాధించలేకపోవడంతో రుణాల చెల్లింపులో ఇబ్బందులు ఎదురయ్యాయని వారు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నారని వారంటున్నారు. కొందరు రైతులు ఇప్పటికే దీర్ఘకాలిక రుణాలు పొందారని, మిగిలిన వారిలో ఎక్కువగా పంట రుణాలు తీసుకుంటారని వారు స్పష్టం చేస్తున్నారు. స్వల్పకాలిక రుణాలు తీసుకున్న రైతులు 6 నెలల్లో తిరిగి రుణం చెల్లిస్తేనే కొత్త రుణం మంజూరవుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. అయితే వర్షాభావ పరిస్థితులు, పంట దిగుబడులు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి అనేక కారణాల రీత్యా రుణాలు చెల్లించలేదని అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన బ్యాంకు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి రుణాలు మంజూరు చేయాల్సిందేనని ఆదేశించారు. రుణాలు తీసుకున్న రైతుల ఖాతాలను రీ షెడ్యూల్ చేసి రబీ సీజన్‌లో రుణాలు ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రుణం కావాల్సిన రైతుల జాబితా తీసుకొని ఆయా బ్యాంకులకు వెళ్లి రుణాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులకు తెలిపారు. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని ఆ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. కాగా బ్యాంకర్లు మాత్రం జిల్లాలో బ్యాంకింగ్ వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే 12శాతం వృద్ధి చెందిందని కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ ఆదేశాలతో పరిస్థితిలో మార్పు వచ్చి రైతులకు రబీ సీజన్‌లో రుణాలు మంజూరవుతాయన్న ఆశాభావాన్ని వ్యవసాయ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Related Posts