పులవర్తి, ఈలి పార్టీకి దూరమేనా
ఏలూరు,
పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో భారీ సీట్లను కైవసం చేసుకుని, పార్టీని అధికారంలోకి తీసుకు చ్చిన ఈ జిల్లా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మాత్రం పార్టీ పూర్తిగా విఫలమైంది. సామాజిక సమీకరణలు, బంధుత్వాలు ఎక్కు వగా ఉన్న ఈ జిల్లాలో టీడీపీ నాయకత్వం బలహీనంగానే ఉంది. దీంతో ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయ త్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని నియజకవర్గాల్లో విస్తృత సమావేశాలు, సమీక్షలు ప్రారంభించారు. సుమారుగా మూడు రోజులు జిల్లాలోనే ఉండి నాయకులను కలుసుకున్నారు. పార్టీ పరిస్థితిని తెలుసుకున్నారు.పార్టీని మళ్లీ అభివృద్ధి దిశగా ఎలా నడిపించాలనే వ్యూహాలపై జిల్లా నాయకులతో చర్చించారు. ఇంత కీలకమైన సమావేశానికి ఓ ఇద్దరు కీలక నాయకులు డుమ్మా కొట్టడం ఒక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు వచ్చింది. వారిద్దరూ కూడా పార్టీకి అత్యంత కీలకమైన నాయకులు కావడం, చంద్రబాబు వరుసగా రెండు మూడు రోజులు జిల్లాలోనే ఉండి సమీక్షలు చేపట్టినా రాకపోవడంతో ఇక, వారు సైకిల్ దిగేందుకు రంగం రెడీ చేసుకున్నారనే వాదన బలంగా వినిపించింది. వారే భీమవరం మాజీ ఎమ్మెల్యే ఈలిపులపర్తి అంజిబాబు, తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే నాని. ఈ ఇద్దరూ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారనే ప్రచారం సాగుతోంది.పులపర్తి విషయానికి వస్తే.. ఈయన మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు స్వయానా వియ్యంకుడు. దీంతో ఇప్పుడు ఆయన గంటా అడుగుజాడల్లో నడుస్తున్నారని సమాచారం. గంటా ఏ పార్టీలోకి జంప్ చేస్తే.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు పులపర్తి సిద్ధమవుతున్నారని అంటున్నారు. అసలు ఎన్నికల్లోనే ఆయన సరిగా దృష్టిపెట్టి ప్రచారం చేయలేదు. ఎన్నికల్లో ఓడిపోయాక అసలు పార్టీని పట్టించుకున్న దాఖలాలే లేవు.అయితే, పార్టీ మార్పు విషయంలో గంటా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పులపర్తి కూడా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. అయితే నియోజకవర్గంలో మాత్రం నాకెందుకు టీడీపీ ఎలా ? పోతే అన్నట్టుగానే అంటిముట్టనట్టు ఉంటున్నారు. ఇక, ఈలి నాని విషయానికి వస్తే.. ఈయన ఇప్పటికే ఆచంట ఎమ్మెల్యే కమ్ మంత్రి చెరుకువాడ రంగనాథరాజుతో కలిసి తిరుగుతున్నారు. ఆయన కారులోనే నాని దర్శనమిస్తున్నారు. దీంతో ఈయన వైసీపీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక, టీడీపీ సమీక్షకు హాజరు కాకపోవడంతో పార్టీ మార్పు వార్తలకు బలం చేకూరుతోంది.