టీడీపీలో వియ్యంకుల కథ...
విజయవాడ,
ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కీలక నేతలుగా ఉన్న ముగ్గురు స్వయానికి ఒకరికి ఒకరు వియ్యంకులు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల లో వీళ్లదే రాజ్యంగా వ్యవహరించారు. తమకు తిరుగులేదన్నట్టు ఉన్నారు. వీరిలో ఇద్దరు మంత్రులుగా ఐదేళ్లపాటు చక్రం తిప్పారు. మరో నేత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పదేళ్లు రాజ్యం ఏలారు. అయితే, ఇప్పుడు మాత్రం పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో దీని మంచి చెడులు పట్టించుకునేందుకు కానీ, టీడీపీని డెవలప్ చేసుకునేం దుకు కానీ, పార్టీలో కీలకంగా ఉండేందుకు కానీ, కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు కానీ ఆఖరుకు చంద్రబాబు నిర్వహిస్తున్న పార్టీ సమీక్షలకు కూడా వారు డుమ్మా కొడుతున్నారు.టీడీపీకి ఈ ముగ్గురు నాయకులు ఎంతెంత దూరం అంటే.. చాలా చాలా దూరం అనే రేంజ్‌లో రాజకీయాలు చేస్తున్నారు. ఆ ముగ్గురు వియ్యంకులే.. గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ, పులపర్తి అంజిబాబు. వీరు టీడీపీలో కీలక నాయకులు. అదే సమయంలో నారాయణ, అంజిబాబు ఇద్దరు తమ పిల్లలను గంటా కుమారులకు ఇచ్చి వివాహం చేశారు. దీంతో వీరు ముగ్గురూ కూడా వియ్యంకులుగా మారారు. ఈ నేపథ్యంలో కుటుంబం పరంగాను, రాజకీయం పరంగాను ఈ ముగ్గురూ కీలకంగా మారారు. ఇక, ఇప్పుడు టీడీపీ నానా కష్టాల్లో ఉంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయి… నాయకులు జంప్ చేస్తున్న పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో పార్టీని నిలబెట్టుకు నేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. జిల్లాల్లో టీడీపీకి జవసత్వాలు ఊదుతున్నారు.అయితే, గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీని, ప్రభుత్వాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకున్న ఈ ముగ్గురూ ఇప్పుడు మౌనం పాటిస్తున్నారన్నదే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న హాట్ టాపిక్. మాజీ మంత్రిగా ఉన్న గంటా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ టికెట్‌పై గెలుపుగుర్రం ఎక్కారు. అధికారం లేనిదే నిద్రపట్టని నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన ఇప్పుడు టీడీపీలో ఇమడలేక పోతున్నారని అంటున్నారు. ఇక, ఇటీవల విశాఖలో చంద్రబాబు నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశాలకు కూడా ఆయన డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం వచ్చింది.గంటా అటు ఢిల్లీ వెళ్లి కూడా బీజేపీ నేతలను కలుస్తూ నానా హడావిడి చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు వైసీపీలోకి వెళ్లేందుకు డోర్లు క్లోజ్ అయ్యాయి. అందుకే గంటా బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లడంతో పాటు తనతో టీడీపీ నుంచి ఎంత మంది వస్తారా ? అని లెక్కల్లో మునిగి తేలుతున్నారట. ఇక, ఈయన వియ్యంకుడు, పశ్చిమ గోదావరికి చెందిన భీమవరం నుంచి పోటీ చేసిన పరాజయం పాలైన పులపర్తి అంజిబాబు తన వియ్యంకుడు గంటా అడుగు జాడల్లోనే నడుస్తున్నారని అంటున్నారు. దీంతో ఆయన కూడా టీడీపీకి అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.బాబు తన జిల్లాలో తన నియోజకవర్గం సమీక్ష పెట్టినా అంజిబాబు వెళ్లలేదు. అదే సమయంలో మరో వియ్యంకుడు, మాజీ మంత్రి నారాయణ కూడా చంద్రబాబు కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆయన కుమార్తె.. పోయి పోయి వైసీపీఅధినేత జగన్‌తో భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. కాస్తో కూస్తో గంటా, అంజిబాబు కంటే నారాయణే పార్టీలో బెటర్ అనిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ముగ్గురు వియ్యంకులు కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో టీడీపీ ఈ ముగ్గురు వియ్యంకుల పరిస్థితి చివరకు ఏమవుతుందో ? ఏ పార్టీలో తేలతారో చూడాలి.