విమానశ్రయాల్లో గిరిజన స్టాల్స్
విశాఖపట్టణం,
అటవీ ఉత్పత్తుల విక్రయాలను దేశమంతటా విస్తరిస్తూనే వ్యాపారాన్ని పెంచుకోవాలని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని విమానాశ్రయాలన్నింటిలో ఈ స్టాళ్ళ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశ, విదేశీయుల తాకిడి అత్యధికంగా ఉండే బెంగళూరు, చెన్నైలో జీసీసీ స్టాళ్ళను ఏర్పాటు చేయడం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలు పరిశీలనలో ఉండటంతో త్వరలో అనుమతులు లభిస్తాయని సంస్థ యాజమాన్యం విశ్వసిస్తోంది. అనుమతులు మంజూరు కాగానే అరకు కాఫీ, వేసవి తాపాన్ని తీర్చే నన్నారి, బిల్వ షర్బత్‌లు, తేనె తదితర డిమాండ్ కలిగి ఉండే అటవీ ఉత్పత్తులతో కూడిన జీసీసీ స్టాళ్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధానమైన విశాఖ విమానాశ్రయంలో ఏడాది కిందటే ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నెలకు మూడు లక్షలకు పైగానే ఆదాయం రాబడుతోంది. ఈ విధంగా 36 లక్షల మేర వార్షిక ఆదాయాన్ని సాధించలగలుగుతోంది. ఇదే తరహాలో విజయవాడ విమానాశ్రయంలో ఆరు మాసాల కిందట జీసీసీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. దేశ, విదేశీ ప్రయాణికుల తాకిడి అంతగా ఉండని ఈ విమానాశ్రయంలో అటవీ ఉత్పత్తుల అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. దీనిని పెంచుకునేందుకు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇక తిరుపతి విమానాశ్రయంలో ఇటీవల ఏర్పాటు చేసిన జీసీసీ స్టాల్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. విశాఖ విమానాశ్రయంలో మాదిరిగానే అటవీ ఉత్పత్తులకు తగిన రీతిలో ఆదరణ లభిస్తోందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఇప్పటికే ముఖ్యమైన మూడు విమానాశ్రయాల్లో పెట్టిన స్టాళ్ళ ద్వారా వార్షికాదాయాన్ని పెంచుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో దేశంలో ముఖ్యమైన ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో అరకు కాఫీతో కూడిన జీసీసీ స్టాళ్ళను ఏర్పాటు చేయాలని యాజమాన్యం ఆలోచన చేస్తోంది