సకుటుంబ రాజకీయాలకు ఇక దూరం..దూరం
విజయవాడ,
టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న ఓ సీనియర్ నేత ఫ్యామిలీకి చంద్రబాబు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. పార్టీలో యాక్టివ్ గా లేకపోవడంతో పాటు మరో సీనియర్ నేత కుటుంబం నుంచి వస్తోన్న ఒత్తిళ్ల నేపథ్యంలోనే చంద్రబాబు ఆ సీనియర్ కుటుంబాన్ని పక్కన పెట్టే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. అయితే చంద్రబాబు షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఫ్యామిలీ ఏదో కాదు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నేత కాగిత వెంకట్రావు కుటుంబం. కాగిత టీడీపీలో చాలా సీనియర్. ఆయన టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఓ సారి విప్‌గా పనిచేశారు. ఆయన ఓడిపోయిన టైంలో కూడా ప్రతిసారి స్వల్ప తేడాతోనే ఓడిపోయేవారు.నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాగిత 2019 ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో కుమారుడు కృష్ణప్రసాద్ కు టికెట్ దక్కేలా చేసుకున్నారు. అయితే రాష్ట్రం మొత్తం వీచిన జగన్ గాలిలో కృష్ణప్రసాద్ సుమారు 7 వేల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ వైసీపీ తరపున జోగి రమేశ్ విజయం సాధించారు. ఇక ఓటమి తర్వాత కాగిత వెంకట్రావు ఎలాగో బయటకు రాలేదు. అటు కుమారుడు కూడా యాక్టివ్ గా కనిపించలేదు. మధ్యలో ఒకటి రెండుసార్లు చంద్రబాబును కలిసి రావడం మినహా ఆయన చేసిందేమి లేదు. ఎన్నికల్లో ఓడిపోయి ఆరు నెలలు అయినా పార్టీ బలోపేతానికి ఏవిధమైన చర్యలు చేపట్టలేదు. దీంతో పెడనలో టీడీపీ కేడర్ పూర్తిగా నైరాశ్యంలో ఉండిపోయింది. నాయకుడు అండగా లేకపోవడంతో వారు కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు.ఈ సమయంలోనే పెడన నియోజకవర్గంపై ఎప్పటి నుంచి కన్నేసిన మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఫ్యామిలీ చంద్రబాబుని ఒప్పించి పెడన ఇన్‌ఛార్జ్ పగ్గాలు తీసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వాస్తవానికి ఎన్నికల సమయంలోనే పెడనలో పోటీ చేయడానికి కొనకళ్ళ ప్రయత్నాలు చేశారు. నారాయణ ఎంపీగా ఉన్నా చివరి మూడేళ్లలో పెడనలో పట్టుకోసం కాగితతో ఘర్షణ పడుతూనే ఉన్నారు. తాను ఎంపీగా పోటీ చేయనని.. తన కుమారుడికి లేదా తనకు పెడన అసెంబ్లీ సీటు ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి చేశారు. కానీ చంద్రబాబు…కాగిత మీద నమ్మకంతో ఆయన తనయుడికి టికెట్ ఇచ్చారు. అటు కొనకళ్ళకు మళ్ళీ మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు.ఈ క్రమంలోనే పెడనలో కాగిత ఫ్యామిలీ యాక్టివ్ గా లేకపోవడంతో, కొనకళ్ళ తన తనయుడుకు గానీ, తమ్ముడుకు గానీ ఇన్‌చార్జ్ పదవి ఇప్పించుకోవాలని చూస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో కాగిత వర్గంతో పాటు కొనకళ్ల వర్గం కూడా బలంగానే ఉంది. అయితే ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనూ.. ఇటు నియోజకవర్గంలో దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉన్నందున చంద్రబాబు ఈ పరిస్థితులను గమనించి ఇన్‌చార్జ్‌ని మార్చే యోచన చేయొచ్చని అంటున్నారు. చంద్రబాబు కాగిత ఫ్యామిలీని తప్పిస్తే రాజకీయాల్లో ఆ ఫ్యామిలీకి ఎండ్ కార్డు వేసినట్టే అనుకోవాలి. అదే టైంలో కొనకళ్ల ఫ్యామిలీ ప్రెజర్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు డెసిషన్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.