సీపీఎస్ రద్దు దిశగా నిర్ణయం
విజయవాడ, నవంబర్ 27 :
పాలనలో దూకుడు పెంచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నవరత్నాలతో పాటూ సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా జగన్ సర్కార్ ఏపీ ఉద్యోగులకు సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్) రద్దుకు సంబంధించి ముందడుగు వేసింది.సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం వర్కింగ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ నేతృత్వంలో ఐదు శాఖల కార్యదర్శులతో ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఛైర్‌పర్సన్‌గా చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఉంటారు.. కమిటీ కన్వీనర్‌గా ఆర్థికశాఖ కార్యదర్శి.. ప్లానింగ్, పాఠశాల విద్య, పంచాయతీ రాజ్, వైద్య శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. గతంలో ఎన్పీ టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను కమిటీ పరిశీలించనుంది. అలాగే జూన్ 30లోపు నివేదిక అందజేయనుంది.పాదయాత్ర సమయంలో, ఎన్నికలకు ముందు సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ఉద్యోగులకు జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే సీపీఎస్ రద్దుపై ఫోకస్ పెట్టారు. కేబినెట్ సమావేశాల్లోనూ ఇదే అంశంపై చర్చించారు. అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేశారు.. జూన్ 30నాటికి కమిటీ నివేదిక అందజేయనుండటంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.