సంక్షేమ కార్యక్రమల అమలులో పారదర్శకత ఉండాలి
గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, నవంబర్ 27 :
మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది వైపు నుంచి ఎలాంటి లోపం, నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించేది లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని, లబ్దిదారుల సంతృప్తి లక్ష్యంగా మన పనివిధానం ఉండాలని సూచించారు. మహిళా-శిశు సంక్షేమ శాఖ పనితీరు మెరుగుపర్చడంలో భాగంగా నేడు రాష్ట్రంలోని జిల్లా సంక్షేమ శాఖ అధికారులతో హైదరాబాద్ లో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.రాజ్యాంగం ఆమోదం పొంది 70 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులు, బాధ్యతల స్పూర్తితో అధికారులు పనిచేయాలన్నారు. మనందరికి రాజ్యాంగమే ప్రవర్తనా నియామవళి గ్రంథం కావాలన్నారు.మహిళలు కూడా ఆలోచించని రీతిలో ఆలోచించి సిఎం కేసిఆర్ గారు రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని, మనం కూడా అదే స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి మహిళా, శిశు సంక్షేమ శాఖ అంటే ఎక్కువ ఇష్టమని, మహిళల సంక్షేమం, భద్రతకు ఆయన అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించారని చెప్పారు. సిఎం ప్రవేశపెట్టిన ఈ పథకాలు సమర్థవంతంగా నిర్వహించడంలో మనమంతా సమిష్టిగా పనిచేసి వాటిని లబ్దిదారులకు సకాలంలో సమగ్రంగా అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో మహిళలు పౌష్టికాహార లోపం, రక్తహీనతతో ఉండకూడదనే గొప్ప ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని తీసుకొచ్చారని, దీనిని అమలు చేయడంలో అధికారులు మనసు పెట్టి పనిచేయాలని కోరారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా ఇలాంటి పథకం అమలు చేయాలని ఆలోచనలు చేస్తున్నారని, సిఎం కేసిఆర్ దూరదృష్టి వల్ల మన రాష్ట్రంలో ఈ పథకం ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి అమలవుతోందన్నారు.సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారులు అంగన్ వాడీ కేంద్రాల్లో, కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో సిబ్బంది కొరత, అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలకు బదిలీ చేయడంలో ఉన్న ఇబ్బందులు, కిరాయి భవనాలలోని సమస్యలను, కోర్టులో పెండింగ్ కేసుల వల్ల పరిపాలనలోని ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా-శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర బోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.