కలుషితమే దిక్కు..(విజయవాడ)
విజయవాడ, నవంబర్ 27 : నగరంలో స్వచ్ఛమైన నీటి కోసం వెంపర్లాడాల్సిన దుస్థితి నెలకొంది. గుక్కెడు స్వచ్ఛమైన నీరు దొరకడమే గగనంగా మారుతోంది. ఇటీవల కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పరీక్ష ఫలితాలే ఇందుకు నిదర్శనం. రాజధానిలో ప్రజలకు అందిస్తున్న తాగు నీరు ఏమాత్రం ప్రమాణాలకు తగ్గట్లు లేవని తేలింది. అమరావతిలో మొత్తం పది నమూనాలకు గాను నాలుగు మాత్రమే సక్రమంగా ఉన్నాయి. విజయవాడ నగరపాలిక అందిస్తున్న నీటి నాణ్యత ప్రశ్నార్థకంగా ఉంటోంది. ప్రధానంగా పైప్‌లైన్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటోంది. మురుగునీరు కలుస్తుండడంతో కొళాయిల్లో స్వచ్ఛమైన నీరు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే తార్కాణం. నిత్యం తాగు నీటి నమూనాలను పరీక్షించి, కార్పొరేషన్‌ను అప్రమత్తం చేయాల్సిన ప్రయోగశాల నామ్‌కేవాస్తేగా మారిపోయింది. జిల్లా ప్రజారోగ్య ప్రయోగశాల పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. సిబ్బంది కొరత, అరకొర పరికరాలతో అవసాన దశకు చేరుకుంది. మరోవైపు గుంటూరులోని పరీక్ష కేంద్రాన్ని ప్రాంతీయ ప్రయోగశాలగా ఉన్నతీకరించారు. ఇక్కడ మాత్రం పూర్తిగా వదిలేశారు. ఇక్కడ సిబ్బంది కూడా లేరు. ఒక జూనియర్ ఎనలిస్టు, ఇద్దరు టెక్నీషియన్లు, ఓ ల్యాబ్ అటెండెంట్, ఇద్దరు శాంపిల్ టేకర్లు, ఒక జూనియర్ అసిస్టెంట్ ఉండాలి. ఇక్కడ కేవలం ఓ జూనియర్ అనలిస్ట్ మాత్రమే ఉన్నారు. నమూనాలు తీసుకునేందుకు ఇద్దరిని పొరుగుసేవల పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇక్కడ కేవలం క్లోరిన్ ఆనవాళ్లు పరీక్షించడానికే పరిమితమవుతున్నారు. నీటి నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు రసాయన పరీక్షలు చేయాలి. ఇక్కడ అవి జరుగుతున్న దాఖలాలు లేవు. ఈ పరీక్ష చేస్తేనే నీటి నాణ్యతపై సమగ్రంగా వివరాలు వస్తాయి. ఇక్కడి సిబ్బంది వారానికి ఒకసారి మాత్రమే నగర పరిధిలో నమూనాలు తీస్తున్నారు. వాటిలో చాలా వరకు గుంటూరు కేంద్రానికే పపించాల్సి వస్తోంది. నగరంలో వీలైనన్ని నమూనాలు సేకరించి, వాటిని విశ్లేషించి.. ఫలితాలను నగరపాలక అధికారులకు పంపాల్సి ఉంది. ఇక్కడ వసతులే లేకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. విజయవాడలోని ఈ కేంద్రంలోనే నీటి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. నగరపాలక ఉద్యోగులతో పాటు ఇక్కడి సిబ్బంది కూడా నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగశాలలోని నీటి పరీక్షల ఫలితాలను చూస్తే నాణ్యత సంతృప్తికరంగా లేవని తెలుస్తోంది. ఇటీవల ఈ.కొలి, క్లెబ్‌సీలా వైరస్‌లు కనిపించాయి. నగర శివారు అజిత్‌సింగ్‌నగర్, వైఎస్‌ఆర్ కాలనీల్లో సరఫరా అయిన నీటిలో క్లెబసీలా వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. ఈ నీటిని తాగితే వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. విజయవాడ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కృష్ణా నది చెంతనే ఉన్నా నగరవాసులకు స్వచ్ఛ జలం కలగా మారుతోంది. బెజవాడ జనాభా 12.50 లక్షలు. 59 డివిజన్లలో మొత్తం 1.92లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరికి రోజుకు 37,500 ఎంజీడీ నీటిని నగరపాలిక సరఫరా చేస్తోంది. రిజర్వాయర్ల నుంచి ఇళ్లకు వెళ్తున్న పైప్‌లైన్లు దాదాపు మురుగు నీటి కాలువల పక్కనే ఉన్నాయి. దీని వల్ల గొట్టాలు దెబ్బతిన్న సమయంలో, వాటి ద్వారా మరుగునీరు కలుస్తోంది. ఫలితంగా క్రిములు వృద్ధి చెంది కలుషితం అవుతోంది. ఈ నీటిని తాగడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మలినాలను శుభ్రం చేసేందుకు నగరపాలిక అధికారులు తాగునీటిలో క్లోరిన్ వాయువును కలుపుతున్నారు. ఎగువ ప్రాంతాల వారు మోటార్లు వాడుతుండడంతో చివరి ప్రాంతాలకు వెళ్లే సరికి క్లోరిన్ ప్రభావం నామమాత్రంగా మారుతోంది. విజయవాడ శివారు ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి కాలుష్య కారకాలు వచ్చి నదిలో కలుస్తున్నాయి. నగర అవసరాలకు కార్పొరేషన్ అధికారులు నది నుంచి నీటిని తీసుకుని కె.ఎల్.రావు వాటర్ వర్క్స్‌లో రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తున్నారు. రిజర్వాయర్ల వద్ద నిత్యం నీటి నమూనాలను తీసుకుని పరీక్షించాల్సి ఉంది. సిబ్బంది కేవలం క్లోరినేషన్ తెలుసుకునేందుకే పరిమితం అవుతున్నారు. నీటి నాణ్యత గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా చాలా ప్రాంతాల్లో నిర్దేశిత ప్రమాణాలకు లోబడి నీటి నాణ్యత ఉండడం లేదు. హెడ్ వాటర్ వర్క్స్ ప్రాంగణంలో ఐపీఎం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్టివ్ మెడిసిన్) విభాగం ఆధ్వర్యంలో నీటి పరీక్ష కేంద్రం నడుస్తోంది.