ఇంకా ఇసుక కష్టమే.. (ప్రకాశం)
ఒంగోలు, నవంబర్ 27 : జిల్లాలో ఇసుక.. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.. పాలేరు, ముసి, మన్నేరు, గుండ్లకమ్మ నదుల్లో లభ్యతకు కొదవ లేకున్నా... ఇప్పటికే అనుమతిచ్చిన 15 రీచ్‌ల్లో రెండింటిలోనే లభ్యత ఉంది. గిరాకీ మేరకు ఇసుక లభించాలంటే సగటు జీవి మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొనగా- మరోవైపు అక్రమార్కులు రాత్రిళ్లు యథావిధిగా వనరును తరలించుకు పోతూ సొమ్ము చేసుకుంటున్నారు. గిరాకీ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 22 ప్రాంతాల్లోని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు గనులశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అందులో ఇప్పటికే 15 రీచ్‌ల్లో తవ్వకాలకు అనుమతి ఇవ్వగా- ప్రస్తుతం రెండింటిలో మాత్రమే లభ్యత ఉంది. 11 రీచ్‌ల్లో నిలిచిపోగా... మరో రెండింటిని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మద్దిపాడు మండలం మల్లవరంలో నాలుగు, కీర్తిపాడులో మూడు, అన్నంగిలో ఒకటి, ముండ్లమూరు మండలం పోలవరంలో 1, చినగంజాం మండలం చినగంజాం, పెదగంజాంలో ఒకటి చొప్పున; జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో నాలుగు పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల నిమిత్తం రీచ్‌లకు అనుమతి ఇచ్చారు. ఇందులో ప్రధానంగా గుండ్లకమ్మ నది ప్రవాహం కారణంగా మల్లవరం, కీర్తిపాడు ప్రాంతాల్లోని ఏడు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు నిలిచాయి. పాలేరు నది ఒడ్డున ఉన్న కె.బిట్రగుంట గ్రామ సమీపంలోని పట్టా భూముల్లో గుర్తించిన నాలుగు రీచ్‌ల్లో స్థానికంగా కొంత వివాదం నెలకొనడంతో... ఇక్కడా సరఫరా ఆగింది. దీంతో ఆయా ప్రాంత వాసులకు ఇసుక కొరత నెలకొంది. జిల్లాలోని ప్రధాన ఇసుక వనరులైన పాలేరు, ముసి, మన్నేరు, గుండ్లకమ్మ నదుల ఆధారంగా ఉన్న వాగులు, వంకలతో పాటు ఇతర గ్రామాల పరిధిలోని 62 ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు కలెక్టర్ ఇటీవల అనుమతి ఇచ్చారు. వాటిలో అద్దంకి, మద్దిపాడు, ఒంగోలు, చీమకుర్తి, కొండపి, టంగుటూరు, సంతనూతలపాడు, పొదిలి, జరుగుమల్లి, పీసీపల్లి, పొన్నలూరు, కందుకూరు, సింగరాయకొండ, ఉలవపాడు, సంతమాగులూరు, తాళ్లూరు, ముండ్లమూరు, గుడ్లూరు, హనుమంతునిపాడు, దర్శి, సీఎస్‌పురం మండలాల పరిధిలోని గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి వాగులు, వంకలపై ఇసుక తవ్వకాలకు స్థానికంగా అనుమతి ఇచ్చారు. తవ్వకం బాధ్యతను నేరుగా పంచాయతీ కార్యదర్శికి.. వీఆర్వోకి అప్పగించారు. ఇసుక కావాల్సిన నిర్మాణదారుడు నేరుగా నిర్ణయించిన ధర ప్రకారం గనులశాఖ ఖాతాకు నగదు జమ చేసి.. ఆ రసీదును పంచాయతీ కార్యదర్శికి చూపించి.. ఆ ప్రాంతం నుంచి ఇసుక తీసుకువెళ్లే అవకాశం కల్పించారు. అద్దంకి మండలంలోని గ్రామాల్లో మొత్తం తొమ్మిది చోట్ల తవ్వకానికి అనుమతి ఇవ్వగా- కేవలం కంకుబాడు గ్రామంలోని చిలకనేరు వాగు మీద మాత్రమే సరఫరా జరుగుతోంది. ఆ ప్రాంత వాసులు అక్కడికి బారులు తీరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు అయిదో తేదీ నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి తెచ్చింది. పారదర్శకంగా, తక్కువ ధరకే వనరును అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. మూడు నెలలు గడుస్తున్నా సొంత గూడు నిర్మించుకోవాలన్న పేదోడికి లభ్యత గగనమే అవుతోంది. జిల్లాలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిగణనలోకి తీసుకుంటే... రోజుకు సరాసరిన నాలుగు నుంచి అయిదు వేల టన్నుల ఇసుక అవసరం. ప్రస్తుతం రెండు రేవుల్లోనే తవ్వకం జరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రీచ్‌ల్లో తవ్వకాలకు సాధ్యపడటం లేదు. దాంతో అక్కడి వారు ఆన్‌లైన్‌లో ప్రకాశం జిల్లా నుంచి బుక్ చేసుకుంటుండగా- ఆయా జిల్లాల నిర్మాణదారులకు మల్లవరం నుంచే ఇసుక తరలిపోతోంది. అక్కడా ప్రస్తుతం రేవు ఆగిపోవడంతో సమస్య జటిలమైంది. స్థానికులు ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు ప్రయత్నించి.. విఫలమవుతున్నారు. ఎంత సేపు నిరీక్షించినా... క్షణాల్లో ‘నో స్టాక్’ సమాచారం వస్తోందని చెబుతున్నారు. గుర్తించిన రీచ్‌ల్లో ఇసుక తవ్వి.. ముందస్తుగా ఏర్పాటు చేసిన నిల్వ కేంద్రాల ద్వారా విక్రయించేలా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఏర్పాట్లు చేసినా... ప్రస్తుతం అక్కడా అరకొరగానే నిల్వ ఉంది. గిద్దలూరు నిల్వ కేంద్రాన్ని నాలుగు రోజుల కిందట ప్రారంభించారు. అక్కడికి కడప జిల్లా నుంచి సరఫరా జరుగుతోంది. ఇక్కడ రెండు వేల టన్నుల నిల్వ ఉంది. మార్కాపురంలో 554 టన్నుల నిల్వ ఉన్నా.. నాణ్యత లేదంటూ.. గృహ నిర్మాణదారులు దాన్ని తీసుకువెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇసుక కొరత పరిష్కార క్రమంలో కొందరు రైతుల పట్టా భూములను గుర్తించినా... సంబంధిత యజమానులు ఏపీఎండీసీతో ఒప్పంద పత్రాలు రాసుకోవాల్సి ఉంది. ఈ తరహా భూముల్లో తీసిన ఇసుకకు గాను క్యూబిక్ మీటరుకు రూ. 60 చొప్పున రైతుకు చెల్లిస్తామని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. వందకు పెంచారు. అయినా.. కొందరు రైతులు అనాసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇప్పుడొచ్చే నగదుకు ఆశ పడితే... ఇసుక తవ్వకాల వల్ల కుటుంబానికి ఆసరాగా ఉన్న భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందని వెనకగడుగు వేస్తున్నట్లు సమాచారం. దీంతో పట్టా భూముల్లో ఇసుక లభ్యతకు గండి పడింది. ప్రభుత్వం అనుమతిచ్చిన రీచ్‌ల్లో డిమాండ్ కంటే ఇసుక లభ్యత తక్కువగా ఉంది. ఇదే అదనుగా అక్రమార్కులు గుండ్లకమ్మ, పాలేరు, ముసి, మన్నేరు, ఇతర వాగులు, వంకలతో పాటు, చినగంజాం, వేటపాలెం, కొత్తపట్నం తీర ప్రాంతాల నుంచి రాత్రిళ్లు అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఇలా తరలించిన ఇసుక ఒంగోలు నగరంలో ట్రక్కు రూ. నాలుగు వేలు పలుకుతుండగా... పాలేరు, ముసి నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇసుకను పొలాల మీదుగా సమీప గ్రామాలకు తరలించి రూ. రెండు వేల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం.