అన్నీ ఉన్నా.. (తూర్పు గోదావరి)
కాకినాడ, నవంబర్ 27 : పారిశ్రామికీకరణకు అపార అవకాశాలున్న జిల్లా తూర్ఫు. వాటిని అందిపుచ్చుకోవడంలో మాత్రం వెనకబాటు కనిపిస్తోంది. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వేలాది ఎకరాల విలువైన భూములను ఇప్పటికే కేటాయించారు. పలుచోట్ల ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక - మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో మౌలిక వసతులు సైతం కల్పించారు. ఇంత చేసినా పరిశ్రమల ఏర్పాటులో మాత్రం తాత్సారం చోటు చేసుకుంటోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దే పనిలో ఏపీఐఐసీ నిమగ్నమైంది. జిల్లాలో వ్యవసాయం, ఆహార శుద్ధి, విద్యుత్తు, మౌలిక వసతులు, తయారీ రంగం, పెట్రో కెమికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్ తదితర రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రూ. వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఏర్పాటైన పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించే అంశంపై దృష్టి పెడుతోంది. పారిశ్రామిక వాడల ఏర్పాటు దిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు భూముల కేటాయింపులో 50 శాతం రాయితీలు ఇప్పటికే అందిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేశారు. ఎక్కువగా సూక్ష్మ- చిన్న- మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 29 పారిశ్రామిక వాడలుండగా.. మరో మూడు చోట్ల ఏర్పాటు ..మిగతా 9లోప్రక్రియ కొలిక్కి వస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించినప్పుడు క్రయ ఒప్పందం చేసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలయితే.. భూమి స్వాధీనం చేసిన రెండేళ్లలో, ఇతరులైతే ఏడాదిలోగా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి. గడువులోగా సాంకేతిక కారణాలతో చేయలేకపోతే.. నిర్దేశిత అపరాధ రుసుంతో మరో రెండేళ్లపాటు ఈ గడువు పొడిగించుకోవచ్ఛు పెద్ద పరిశ్రమలకు మూడేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు గడువు ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నా భూముల స్వాధీనం తర్వాత పరిశ్రమల ఏర్పాటులో తాత్సారం జరుగుతోంది. డబ్బు మొత్తం చెల్లించని పారిశ్రమికవేత్తలకు సేల్ డీడ్ జరగక.. బ్యాంకు రుణాలు మంజూరుకాక కొన్నిచోట్ల కదిలిక ఉండడం లేదు. సేల్ డీడ్ చేసినా కొందరు పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో సమస్య ఎదురవుతోంది. పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తున్నవారికి జిల్లాలో 25 సంస్థలకు తాఖీదులు ఇచ్చారు. ఆరుగురికి కేటాయించిన భూములను వెనక్కి తీసుకున్నారు. కొందరైతే పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ప్రహరీలు కట్టి అలాగే వదిలేస్తుండడంతో పారిశ్రామిక ప్రగతికి అవకాశం లేకుండా పోతోంది.
జిల్లాలో 29 పారిశ్రామిక వాడలతోపాటు.. కాకినాడ, రాజమహేంద్రవరంలలోని ఆటోనగర్‌లలో పరిశ్రమల ఏర్పాటుకు 3,667.13 ఎకరాల భూమిని ఇప్పటివరకు కేటాయించారు. ఇందులో పారిశ్రామిక అవసరాలకు 3,167.17 ఎకరాలు వినియోగించాలని నిర్ణయించారు. 1502 ప్లాట్లు విభజిస్తే.. ఇప్పటివరకు 1273 ప్లాట్లు మాత్రమే కేటాయించారు. కేటాయించినా 54 ప్లాట్లు ఖాళీగా ఉండగా.. ఇంకా కేటాయించాల్సినవి 175 వరకు ఉండడం గమనార్హం. మార్కెట్ ఆశాజనకంగా లేదని కొందరు ప్రారంభంలో తాత్సారం చేస్తుంటే.. మరికొందరు ప్రత్యామ్నాయాల దిశగా అడుగులు వేస్తుండడంతో మూతపడుతున్నాయి. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటివరకు రూ.7500 కోట్ల వరకు పెట్టుబడులు రాగా.. 53వేల మంది వరకు ఉపాధి అవకాశాలు దక్కాయి. భారీ పరిశ్రమల ఏర్పాటు చేసిన భూముల్లో పరిశ్రమల ఏర్పాటు కార్యరూపం దాలిస్తే లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటుకు నిర్దేశిస్తున్న ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉంది. దీంతో పారిశ్రామికవేత్తలు అసౌకర్యానికి గురవుతున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో వసతుల కల్పనను పర్యవేక్షించే విభాగం తీరు విమర్శలకు తావిస్తోంది. కాకినాడ గ్రామీణం పరిధిలోని సర్పవరంలోని ఆటోనగర్‌లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండడం.. రహదారులు అధ్వానంగా ఉండడంతో వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ రోజుల్లో దుమ్ము-ధూళి సమస్య ఎక్కువగా ఉంది. కొన్ని ప్లాట్ల వ్యవహారం వివాదాస్పదం కావడంతో వాటి జోలికి వెళ్లడంలేదు. దీంతో ఎక్కడిక్కడ వర్షం నీరు నిలబడి అసౌకర్యానికి గురిచేస్తోంది. రాజమహేంద్రవరం పరిధి ఆటోనగర్ ప్రారంభంలో రహదారులు మెరుగుపరచాల్సి ఉంది.