YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

నో హైబ్రిడ్ (ఖమ్మం)

నో హైబ్రిడ్ (ఖమ్మం)

నో హైబ్రిడ్ (ఖమ్మం)
ఖమ్మం, నవంబర్ 27 : జిల్లాలోని అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం నిరుపయోగంగా మారడంతో రైతులు విత్తన మొక్కలపైనే ఆధారపడాల్సి వస్తోంది. హైబ్రీడ్‌ కొబ్బరి మొక్కలు లేక ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. మొక్కలు కావాలంటే ఏడాదిపాటు నిరీక్షించాల్సిన దుస్థితి. పక్క రాష్ట్రానికి వందలాది కిలో మీటర్లు దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. సంకరజాతి కొబ్బరి మొక్కలు కావాలని చాలాఏళ్లు రైతులు విజ్ఞప్తులు చేస్తున్నా.. పట్టించుకొన్న నాధుడే కవరయ్యారు. విత్తనాలకే పరిమితం అయ్యాయి. పునరుత్పత్తి నీరుగారుతోంది. దిగుబడి ఏడాదికేడాది పడిపోతుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అవకాశాలున్నా అధికారుల ఉదాసీన వైఖరితో కొబ్బరి హైబ్రీడైజేషన్‌ (సంకరజాతి కొబ్బరి మొక్కల తయారీ) 15 ఏళ్లుగా మూలనపడింది. విత్తనం మొక్కలంటే ఎలాంటి రకాలు వస్తాయో ఎవరికీ తెలియని పరిస్థితి. హైబ్రీడ్‌ మొక్కలైతే ఎంపిక చేసినవే లభిస్తాయి. దిగుబడి అనుకున్న విధంగా వచ్చే అవకాశాలుంటాయి. అశ్వారావుపేటలో 1992లో కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఏర్పాటు చేశారు. ఇందులో పొడవు పొట్టి రకాలను సంకరపరచి నూతన రకం విత్తనాలు తయారు చేయడం ప్రధాన లక్ష్యం. దీనికోసం కేరళలోని కాసర్‌గడ్‌ జాతీయ కొబ్బరి పరిశోధనా కేంద్రం నుంచి తెచ్చిన ప్రత్యేక హైబ్రీడ్‌ మొక్కలైన మలయన్‌ ఎల్లోడ్వార్ఫ్‌, మలయన్‌ గ్రీన్‌ డ్వార్ఫ్‌, మలయన్‌ ఆరెంజ్‌ డ్వార్ఫ్‌, గంగాబోండాం, ఛౌఘాట్‌ ఆరెంజ్‌ డ్వార్ఫ్‌, ఛౌఘాట్‌ గ్రీన్‌ డ్వార్ఫ్‌ లాంటి పొట్టి రకాలు నాటారు. వీటి సంకరీకరణకు అవసరమైన పుప్పొడి తయారీ కోసం అచ్యుతాపురం ఉద్యాన నర్సరీలో ఈసీ టాల్‌(ఈస్ట్‌ కోస్ట్‌ టాల్‌) రకం మొక్కలు నాటారు. ఈసీటాల్‌ నుంచి సేకరించిన పుప్పొడిని అశ్వారావుపేట కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రంలోని పొట్టి రకాలతో సంకరపరచి కొత్త విత్తనాన్ని తయారు చేయడం ప్రధాన లక్ష్యం. 2005 వరకూ బాగానే మొక్కల తయారీ జరిగింది. ఆ తరువాత సంకరీకరణం నిలిచిపోయింది. దీంతో హైబ్రీడ్‌ కొబ్బరి మొక్కల కావాలంటే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం లేదా ఏలూరు సమీపంలోని వేగివాడ కొబ్బరి అభివృద్ధి మండలి నర్సరీకి వెళ్లాల్సి వస్తోంది. ఆసక్తి ఉన్న రైతులెవరైనా కొబ్బరి తోట వేయాలంటే ఇప్పుడు అంబాజీపేట వెళ్లి దరఖాస్తు చేస్తే వచ్చే ఏడాది మొక్కలు ఇస్తారు. ఒక్కోసారి రెండేళ్లు పట్టవచ్ఛు అది కూడా రెండు, మూడు ఎకరాల కంటే ఎక్కువ మొక్కలు దొరికే పరిస్థితిలేదు. ఇన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర, జిల్లా ఉద్యాన శాఖాధికారులు కొబ్బరి హైబ్రీడైజేషన్‌ దిశగా అడుగులు వేయడంలేదు. ఇటీవల రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయం నుంచి వచ్చిన ఉద్యాన అధికారి త్వరలోనే అశ్వారావుపేటలో కొబ్బరి హైబ్రీడైజేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పడంతో ఈ ప్రాంత రైతులు సంతోషించారు. ఆ హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో కొబ్బరితోటలు విస్తరించి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నల్గొండ, మిర్యాలగూడెం, నిజామాబాద్‌, కరీంనగర్‌ ప్రాంతాల్లోనూ తోటలు వేస్తున్నారు. రైతులు కొబ్బరి తోటలు వేసేందుకు ఉత్సాహంగా ఉన్నా హైబ్రీడు రకం మొక్కలు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఆయిల్‌పాంకు దీటుగా కొబ్బరితోటల విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోంది. ఏడాది పొడవునా పంట దిగుబడి ఇచ్చే అవకాశం ఉండటం, అంతర పంటల సాగుకు అనువుగా ఉండటంతో ఈ సాగుపై రైతులు దృష్టి పెడుతున్నారు. ఈ ప్రాంతంలో హైబ్రీడు కొబ్బరి మొక్కలు అందుబాటులో ఉంటే విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఏటా కోటిన్నర ఆదాయం ఈ ప్రాంత రైతులు పొందుతున్నారు. ఈ ప్రాంతంలోనే హైబ్రీడు రకం మొక్కలు అందుబాటులో ఉంటే రైతుల ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఏపీలోని అంబాజీపేటలో హైబ్రీడు మొక్కల కోసం ఈ ప్రాంత రైతులు 150 మంది నిరీక్షిస్తున్నట్లు సమాచారం. వీరు కొబ్బరి మొక్కల కోసం మరో ఏడాది పాటు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. అది కూడా ఎన్ని మొక్కలు కావలిస్తే అన్ని ఇచ్చే పరిస్థితిలేదు. పరిమిత మొక్కలే ఇస్తున్నారు.

Related Posts