దివ్యాంగుల క్రీడాపోటీలు
ఒంగోలు, :
జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. బుధవారం స్థానిక ఒంగోలు పెరెడ్ గ్రౌండ్ లో జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 3వతేదీన అంతర్జాతీయ విభిన్నప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి డిసెంబర్ 3వ తేదిన బహుమతులు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే జిల్లా స్థాయిలో క్రీడల్లో గెలుపొందిన విభిన్న ప్రతిభావంతులను రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడాపోటీలకు పంపడం జరుగుతుందని ఆయన తెలియజేసారు. సామన్య ప్రజల మాదిరిగా విభిన్న ప్రతిభావంతులు కూడా జీవించాలని ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టడం జరిగిందని ఆయన అన్నారు. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సహకాలను వినియోగంచుకొని అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. డిసెంబర్ 3న జరుగనున్న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగవకాశాలు కల్పించడానికి అన్ని శాఖల నుండి సమాచార సేకరించి ఉద్యోగాలను భర్తీ చేయడానికి త్వరలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలియజేశారు. విభిన్న ప్రతిభావంతులకు వికలాంగత్వ సర్టిఫికెట్లను త్వరితగతిన జారీ చేసేవిధంగా రామ్స్ అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా సదరమ్ సర్టిఫికేట్లు జారీచేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మీ సేవ కేంద్రాలలో వికలాంగత్వ సర్టిఫికెట్ల కోసం స్లాట్లను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. జిల్లాలో అర్హత వున్న వికలాంగులకు జనవరి నుండి కొత్త పెన్షన్లు ఇస్తామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల జిల్లా స్థాయి రన్నింగ్, షార్ట్ ఫుట్, లాంగ్ జంప్, క్యారమ్స్, క్రికెట్, డ్రాయింగ్ తదితర క్రీడాపోటీలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ అసెస్టెంట్ డైరెక్టర్ లక్ష్మి దుర్గా, స్టెస్ సి.యి.ఓ.పి.వి. నారాయణ, ఎ.ఆర్.డి.ఎస్.పి.రాఘవేంద్రరావు, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస రెడ్డి, అంజి రెడ్డి, వివిధ పాఠశాలల విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.