కడప టూర్ లో బాబు భావోద్వేగం
కడప :
టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. గత మూడు రోజులుగా జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. పార్టీ బలోపేతంతో పాటూ కార్యకర్తలు, నేతల సమస్యల్ని తెలుసుకుంటున్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ బాధితులంటూ టీడీపీ కార్యకర్తలు, నేతల్ని కలిశారు. అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు.పర్యటనలో భాగంగా కడపలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. చంద్రబాబు ఓ కార్యకర్తను పరామర్శించిన సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. నర్సయ్య అనే పార్టీ కార్యకర్త వైఎస్సార్‌సీపీ నేతలు వేధిస్తున్నారని తన బాధను చెప్పుకున్నారు. అధినేత ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. నర్సయ్యను వేదిక మీదకు పిలిచిన చంద్రబాబు. ఇంత వయసులో కూడా పెద్దాయనను వైఎస్సార్‌సీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా.. ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారని ప్రశంసలు కురిపించారు.తాను ఎన్ని కష్టాల్లో ఉన్నా పార్టీలోనే ఉంటూ ధైర్యంగా ఉన్నారంటూ చంద్రబాబు టీడీపీ కార్యకర్త కాళ్లకు మొక్కారు. అంతేకాదు నర్సయ్యకు పార్టీ తరపున ఆర్థికసాయం అందజేశారు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందన్నారు. అవసరమైతే తానే వస్తానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. నర్సయ్య మాత్రమే కాదు.. ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానన్నారు టీడీపీ అధినేత.